Punjab Kings: టైటాన్స్‌కు బ్రేకులేసిన పంజాబ్.. గుజరాత్‌పై భారీ విజయం

  • ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చేసిన పంజాబ్
  • నాలుగు వికెట్లు తీసి టైటాన్స్‌ను దెబ్బకొట్టిన రబడ
  • 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న పంజాబ్
Dhawan Rajapaksa and Livingstone Powers to punjab win

వరుస విజయాలతో దూకుడు మీదున్న గుజరాత్ టైటాన్స్‌కు పంజాబ్ కింగ్స్ బ్రేకులేసింది. అలవోక విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు ఎగబాకి ఫ్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. తొలుత టైటాన్స్‌ను 143 పరుగులకే కట్టడి చేసిన పంజాబ్.. ఆపై రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. 

ఓపెనర్ జోస్ బట్లర్ (1)ను టైటాన్స్ బౌలర్లు త్వరగానే పెవిలియన్ పంపినప్పటికీ శిఖర్ ధావన్-భానుక రాజపక్స జోడీని విడదీయలేకపోయారు. టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ధవన్, రాజపక్స ఇద్దరూ యథేచ్ఛగా షాట్లు ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో 28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 40 పరుగులు చేసిన రాజపక్సను ఫెర్గ్యూసన్ వెనక్కి పంపడంతో 87 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

ఆ తర్వాత వచ్చిన లివింగ్ స్టోన్ అండగా  శిఖర్ ధావన్ మిగతా పని పూర్తిచేసి జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న ధావన్ 8 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 62 పరుగులు చేశాడు. క్రీజులోకి వచ్చీ రావడంతోనే చెలరేగిపోయిన లివింగ్ స్టోన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఫలితంగా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. కాగా, పది మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్‌కు ఇది రెండో పరాజయం.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు ఏమంత కలిసి రాలేదు. కగిసో రబడ దెబ్బకు గుజరాత్ బౌలర్లు వణికారు. నిప్పులు చెరిగే అతడి బంతులను ఎదుర్కోలేక పెవిలియన్‌కు క్యూకట్టారు. ఒక్క సాయి సుదర్శన్ మాత్రం జట్టుకు ఆపద్బాంధవుడిలా నిలిచాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 65 పరుగులతో అజేయంగా నిలవడంతో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. 

ఆ జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. కెప్టెన్ పాండ్యా ఒక్క పరుగుకే అవుట్ కాగా, మిల్లర్ 11, రాహుల్ తెవాటియా 11 పరుగులు చేశారు. నాలుగు వికెట్లు తీసి టైటాన్స్ కొంపముంచిన కగిసో రబడకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పుణెలో మ్యాచ్ జరగనుంది.

More Telugu News