Raghu Rama Krishna Raju: ఏపీలో 3 హ‌త్య‌లు, 6 మాన‌భంగాలు అని చెబుతుంటే బాధేస్తోంది: ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు

  • 2019తో పోలిస్తే 63 శాతం నేరాలు పెరిగాయన్న రఘురాజు 
  • మ‌హిళ‌ల‌పై భౌతిక దాడుల్లో మొద‌టి స్థానంలో ఏపీ ఉందని వెల్లడి 
  • ప్ర‌తి 3 గంట‌ల‌కు ఎస్సీల‌పై ఓ దాడి జరుగుతోందని వ్యాఖ్య 
  • అదృష్టం బాగుండి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాన‌న్న ఎంపీ
raghurama krishnaraju complaint on crimes in ap

ఏపీలో వ‌రుస‌బెట్టి జ‌రుగుతున్న అత్యాచారాల‌పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తాజాగా స్పందించారు. మంగ‌ళ‌వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో 3 హ‌త్య‌లు, 6 మాన‌భంగాలు అని చెబుతుంటే బాధేస్తోంద‌ని, లేని చ‌ట్టాల గురించి త‌మ‌ పార్టీ నేత‌లు మాట్లాడతారనీ అన్నారు. ఏపీలో ఎక్కువ నేరాలు జ‌రుగుతున్నాయ‌ని క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వెల్ల‌డిస్తోంద‌ని కూడా ఆయ‌న చెప్పారు. 

మ‌హిళ‌లపై నేరాల్లో 2020లో ఏపీ 8 వ స్థానంలో ఉంద‌న్న ర‌ఘురామ‌రాజు.. ప‌ని ప్ర‌దేశాల్లో లైంగిక వేదింపుల ఘ‌ట‌న‌ల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఇక మ‌హిళ‌ల‌పై భౌతిక దాడుల్లో మొద‌టి స్థానంలో ఉందని ఆయ‌న పేర్కొన్నారు. 2019తో పోలిస్తే..రాష్ట్రంలో 63 శాతం మేర నేరాలు పెరిగాయ‌ని ఆయ‌న చెప్పారు. 

ప్ర‌తి 3 గంట‌ల‌కు ఎస్సీల‌పై ఓ దాడి జ‌రుగుతోంద‌న్నారు. 2021లో అత్య‌ధిక లాకప్ డెత్‌లు ఏపీలోనే న‌మోద‌య్యాయని, త‌న అదృష్టం బాగుండి పోలీసుల కస్టడీ నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాన‌ని చెప్పారు. శాంతి భ‌ద్ర‌త‌లు క‌ల్పించ‌లేని ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ‌మే కాదని ఆయ‌న వ్యాఖ్యానించారు.

More Telugu News