Talasani: సినీ కార్మికుల కోసం చిరంజీవి పెద్ద ఆసుపత్రి నిర్మించాలనుకుంటున్నారు: మంత్రి తలసాని

  • హైదరాబాదులో మేడే వేడుకలు
  • యూసుఫ్ గూడలో సినీ కార్మికోత్సవం
  • చిరంజీవిపై తలసాని పొగడ్తల జల్లు 
Talasani said Chirnajeevi mulls to built a hospital for workers

ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా హైదరాబాదులో తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కులా ఉన్నారని, ఎన్ని సమస్యలు వచ్చినా చిత్రసీమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. చిరంజీవి అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని, సినీ కార్మికుల కోసం ఆయన పెద్ద ఆసుపత్రి నిర్మించాలనుకుంటున్నారని తలసాని వెల్లడించారు. తెలుగు చిత్రసీమకు కేసీఆర్ సర్కారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని, సినీ కార్మికులకు చేయూతగా నిలుస్తుందని తెలిపారు. 

చిత్రపురిలో ఆసుపత్రి, పాఠశాల నిర్మాణానికి కావాల్సినంత స్థలం ఉందని అన్నారు. చిరంజీవి చిత్రపురిలో ఆసుపత్రి నిర్మిస్తే కొన్ని వేల మంది కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు. కాగా, తెలుగు సినీ ఇండస్ట్రీకి కులం, మతం లేవని ఆయన అన్నారు. తెలుగు సినీ కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇళ్లు లేని సినీ కార్మికులకు చిత్రపురిలో ఇళ్లు ఇస్తామని వెల్లడించారు.

More Telugu News