Mumbai Indians: రాజస్థాన్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ముంబయి బౌలర్లు... బ్యాటర్లు ఏంచేస్తారో..?

  • టోర్నీలో గెలుపునకు మొహం వాచిన ముంబయి
  • 8 మ్యాచ్ లు ఆడితే అన్నింటా ఓటములు
  • రాజస్థాన్ తో మ్యాచ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైనం
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 రన్స్ చేసిన రాజస్థాన్
Mumbai Indians restricts Rajasthan Royals for low score

ఐపీఎల్-15 ప్రారంభం కాకముందు ముంబయి ఇండియన్స్ సొంతగడ్డపై చెలరేగిపోతుందని అంతా భావించారు. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. 8 మ్యాచ్ లు ఆడినా ముంబయి జట్టు ఇప్పటిదాకా బోణీ కొట్టలేకపోయింది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ సీజన్ లో పోటీలన్నీ ముంబయి, పూణేలోనే నిర్వహిస్తున్నా... సొంతగడ్డ ఆధిక్యాన్ని ప్రదర్శించడంలో ముంబయి ఇండియన్స్ విఫలమవుతోంది. 

ఈ నేపథ్యంలో, నేడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో చావోరేవో తేల్చుకునేందుకు బరిలో దిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి... రాజస్థాన్ రాయల్స్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. ముంబయి బౌలర్లు రాణించడంతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. 

ఓపెనర్ జోస్ బట్లర్ 67 పరుగులు చేసినా, అందుకు 52 బంతులు ఆడాడు. ఆఖర్లో రవిచంద్రన్ అశ్విన్ (9 బంతుల్లో 21 రన్స్) వేగంగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు 150 మార్కు దాటింది. ముంబయి బౌలర్లలో హృతిక్ షోకీన్ 2, రిలీ మెరిడిత్ 2, డేనియల్ శామ్స్ 1, కుమార్ కార్తికేయ 1 వికెట్ తీశారు.

కాగా నేటి మ్యాచ్ ను రాజస్థాన్ రాయల్స్ తమ మొదటి సారథి షేన్ వార్న్ (ఫస్ట్ రాయల్)కు అంకితం ఇస్తోంది.

More Telugu News