Kadapa District: చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించినందుకు తప్పుడు కేసులు పెట్టించారు: ఆత్మహత్యాయత్నం చేసిన దంపతుల ఆవేదన

  • కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న దంపతులు
  • కేసు నమోదు కావడంతో మనస్తాపం
  • పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
  • పోలీసులపై ప్రైవేటు కేసు పెడతామన్న బీటెక్ రవి
TDP Worker Couple Attempt To Suicide for filed case against them

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడమే ఆ దంపతులు చేసిన నేరమైంది. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చెరువకాంపల్లెలో జరిగిందీ ఘటన. బాధితుల కథనం ప్రకారం.. టీడీపీ కార్యకర్తలైన రామాంజనేయులు, ఆయన భార్య కృష్ణవేణి కలిసి ఇటీవల చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇది చూసి జీర్ణించుకోలేకపోయిన స్థానిక వైసీపీ నేత తన భార్య పద్మజ పేరుతో రామాంజనేయులు-కృష్ణవేణి దంపతులపై అక్రమ కేసులు పెట్టించారని బాధిత దంపతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌కు రావాలంటూ వారిని ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన దంపతులు నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గతంలోనూ వీరిపై రెండు అక్రమ కేసులు బనాయించారని, పోలీసులు ఇంటికి వస్తుండడంతో అవమానంగా భావించి ఆత్మహత్యకు యత్నించారని బంధువులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరు కడప సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. రామాంజనేయులు-కృష్ణవేణి దంపతుల కారణంగా పద్మజ ఇటీవల ఆత్మహత్యకు ప్రయత్నించారన్నారు. దీంతో కేసు అవుతుందని భయపడే వారు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని అన్నారు. మరోవైపు, ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి మెప్పు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతామని పేర్కొన్నారు.

More Telugu News