Virat Kohli: వరుస వైఫల్యాలతో సతమతం.. ఐపీఎల్ నుంచి తప్పుకోమంటూ కోహ్లీకి రవిశాస్త్రి సలహా

  • ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ
  • 9 మ్యాచుల్లో 128 పరుగులు మాత్రమే చేసిన వైనం
  • లక్నో, హైదరాబాద్‌లపై గోల్డెన్ డక్
  • కోహ్లీకి ఇప్పుడు పూర్తి విశ్రాంతి అవసరమన్న శాస్త్రి 
  • చివరిసారి 2019లో బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ
Pull Out Of The IPL  Ravi Shastris Advice For Virat Kohli

టీమిండియా మాజీ సారథి కోహ్లీకి ఐపీఎల్‌ ఈసారి ఏమాత్రం కలిసి రావడం లేదు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కోహ్లీ పరుగులు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు. క్రీజులోకి వచ్చినంత వేగంగా పెవిలియన్‌కి చేరుకుంటున్నాడు. ఫలితంగా ఈ ఆర్సీబీ మాజీ కెప్టెన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 128 పరుగులు మాత్రమే చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో జరిగిన మ్యాచుల్లో గోల్డెన్ డక్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచన చేశాడు. విరాట్ వెంటనే ఐపీఎల్ నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. ఏకధాటిగా క్రికెట్ ఆడుతున్న కోహ్లీకి కాస్తంత విరామం అవసరమని అన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు సారథిగా వ్యవహరించిన కోహ్లీకి ఇప్పుడు విశ్రాంతి కావాలని, మైండ్‌ను ఫ్రెష్ చేసుకోవాలని సూచించాడు. తన అంతర్జాతీయ కెరియర్‌ను పొడిగించుకోవాలనుకున్నా.. క్రికెట్‌లో మరో ఆరేడేళ్లపాటు తనదైన ముద్ర వేయాలన్నా కోహ్లీ తక్షణం ఐపీఎల్ నుంచి తప్పుకోవడం బెటరని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 

అంతేకాదు, టీమిండియాకు ఆడాలనుకునే వారు ఎవరైనా సరే ఓ గీత గీసుకోవాలని, టీమిండియాకు మ్యాచ్‌లు లేనప్పుడు విశ్రాంతి తీసుకోవాలని అన్నాడు. అంతర్జాతీయ ఆటగాడిగా అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని రవిశాస్త్రి వివరించాడు. కాగా, కోహ్లీ చివరిసారి 2019లో బంగ్లాదేశ్‌‌తో జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు మూడంకెల స్కోరు చేయలేకపోయాడు.

More Telugu News