PBKS: ధావన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నైని ఓడించిన పంజాబ్

  • చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టం
  • రాయుడు మెరుపు ఇన్నింగ్స్ వృథా
  • ఆరో ఓటమిని మూటగట్టుకున్న చెన్నై
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ధావన్
PBKS outplay CSK to return to winning ways

మూడో విజయం సాధించాలన్న చెన్నై ఆశలు ఫలించలేదు. పంజాబ్ కింగ్స్‌తో గత రాత్రి జరిగిన పోరులో చెన్నై ఓటమి పాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టమయ్యాయి. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్ మెరుపులకు తోడు బౌలర్లు రాణించడంతో పంజాబ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌కు ఇది నాలుగో విజయం కాగా, చెన్నైకి ఇది ఆరో ఓటమి. 

పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 176 పరుగులు మాత్రమే చేసింది. ఈసారి కూడా ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. పది పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. పవర్ ప్లేలో ఓపెనర్ ఊతప్ప (1) శాంట్నర్ (9) వికెట్లను కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేసింది. 

అయితే, రాయుడు మాత్రం క్రీజులో పాతుకుపోయి పంజాబ్ బౌలర్లకు దడ పుట్టించాడు. అతడు క్రీజులో ఉన్నంత సేపు జట్టు విజయం దిశగానే పయనించింది. 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి రాయుడు అవుటయ్యాడు. ఇక, చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 27 పరుగులు అవసరం కాగా, క్రీజులో ఉన్న ధోనీ తొలి బంతిని సిక్సర్ కొట్టడంతో మళ్లీ మ్యాజిక్ చేస్తాడని అనిపించింది. 

అయితే, మూడో బంతికి పెవిలియన్ చేరడంతో చెన్నై ఓటమి ఖాయమైంది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసి ఖాతాలో మరో ఓటమిని చేర్చుకుంది. కెప్టెన్ జడేజా 21 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో రబడ, రిషి ధావన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ధావన్ మరోమారు చెలరేగాడు. 59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. భానుక రాజపక్స 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేశారు. మయాంక్ 18, లివింగ్‌స్టోన్ 19 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో బ్రావోకు రెండు వికెట్లు దక్కాయి. బ్యాట్‌తో జట్టుకు విజయాన్ని అందించిన ధావన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

More Telugu News