CPS: సీపీఎస్‌కు బ‌దులుగా జీపీఎస్‌!.. న‌మ్మేలా లేదంటున్న ఏపీ ఉద్యోగులు!

  • ఉద్యోగ సంఘాలతో ప్ర‌భుత్వ క‌మిటీ చ‌ర్చ‌లు
  • జీపీఎస్ పేరిట కొత్త పెన్ష‌న్ స్కీంను ప్ర‌తిపాదించిన క‌మిటీ
  • పాత పెన్ష‌న్ స్కీమే కావాల‌న్న ఉద్యోగ సంఘాలు
  • పీఆర్సీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరిన‌ట్టు వెల్ల‌డి
ap government proposes gps instead of cps to employees

కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం (సీపీఎస్‌) ర‌ద్దుకు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల మ‌ధ్య నెల‌కొన్న వివాదం ప‌రిష్కార‌య్యే దిశ‌గా సోమ‌వారం సాయంత్రం ప్ర‌భుత్వం కొత్త‌గా ఏర్పాటు చేసిన ఐదుగురు స‌భ్యుల క‌మిటీతో ఉద్యోగ సంఘాల నేత‌లు భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్ర‌భుత్వం నుంచి ఓ కొత్త ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. సీపీఎస్ బ‌దులుగా గ్యారెంటీ పెన్ష‌న్ స్కీం (జీపీఎస్‌)ను అమ‌లు చేస్తామ‌ని క‌మిటీ ప్ర‌తిపాదించింది. ఆ మేర‌కు జీపీఎస్‌కు సంబంధించి ఉద్యోగ సంఘాల‌కు క‌మిటీ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ను ప్ర‌ద‌ర్శించింది. 

అయితే ఉద్యోగులు మాత్రం జీపీఎస్ ప‌ట్ల ఆస‌క్తి చూప‌లేదు. కొత్త‌గా ప్ర‌తిపాదించిన జీపీఎస్ ఉద్యోగులు న‌మ్మేలా లేద‌ని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్ చెప్పారు. భేటీ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ అమ‌లుకు సంబంధించిన అంశాల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరినట్లు చెప్పారు. త‌మ‌కు కొత్త పెన్ష‌న్ స్కీం అవ‌స‌రం లేద‌ని, ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చిన‌ట్లుగా సీపీఎస్‌ను ర‌ద్దు చేసి పాత పెన్ష‌న్ విధానాన్ని అమ‌లులో పెట్టాల‌ని తాము కోరిన‌ట్లు చెప్పారు.

More Telugu News