Wriddhiman Saha: సాహాను బెదిరించిన క్రికెట్ జర్నలిస్టు బొరియాపై రెండేళ్ల నిషేధం!

  • ఇంటర్వ్యూ కోసం సాహాను బెదిరించిన బొరియా
  • వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్లను బహిర్గతం చేసిన సాహా
  • బొరియాను దోషిగా తేల్చిన బీసీసీఐ త్రిసభ్య కమిటీ
  • మీడియా అక్రెడిటేషన్ నిలిపివేత
Boria Majumdar likely to get two year ban in Wriddhiman Saha case

టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెట్ జర్నలిస్టు బొరియా మజుందార్‌ను రెండేళ్లపాటు నిషేధించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్టు తనను బలవంతం చేశాడని పేర్కొంటూ రెండు నెలల క్రితం సాహా కొన్ని వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు. ఇంటర్వ్యూ కోసం అతడు ప్రయత్నించినా తాను స్పందించకపోయేసరికి తీవ్ర వ్యాఖ్యలు చేశాడని, భారత క్రికెట్‌కు తాను చేసిన సేవలకు గాను ఓ జర్నలిస్టు నుంచి ఎదురైన అనుభవం ఇదని, జర్నలిజం ఇంతగా దిగజారిపోయిందని సాహా విచారం వ్యక్తం చేశాడు. 

సాహా స్క్రీన్‌షాట్లు వైరల్ అయిన తర్వాత పలువురు క్రికెటర్లు అతడికి అండగా నిలిచారు. ఆ జర్నలిస్టు పేరు వెల్లడించాలని కోరారు. అయితే, అందుకు సాహా నిరాకరించాడు. అయితే, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ విచారణ చేపట్టడంతో త్రిసభ్య కమిటీ ఎదుట సాహా ఆ జర్నలిస్టు పేరును వెల్లడించాడు. 

విచారణ జరిపిన కమిటీ బొరియాను దోషిగా నిర్ధారించింది. అతడిపై రెండేళ్లపాటు నిషేధం విధించాలని నిర్ణయించినట్టు సమాచారం. బొరియాను క్రికెట్ స్టేడియంలోకి రానివ్వొద్దంటూ దేశంలోని అన్ని బోర్డులకు సమాచారం అందిస్తామని, అలాగే, మీడియా అక్రెడిటేషన్ కార్డు కూడా ఇవ్వబోమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బీసీసీఐ నిషేధం వార్తలపై బొరియా ఇప్పటి వరకు స్పందించలేదు.

More Telugu News