KTR: అన్న మీద కోపం ఉంటే ఏపీలో చూసుకోవాలి... షర్మిలకు ఇక్కడేం పని?: కేటీఆర్

  • ఓ మీడియా చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ
  • షర్మిలపై విమర్శనాస్త్రాలు
  • అత్తమీద కోపం దుత్తమీద చూపిస్తోందని వ్యాఖ్యలు
  • అన్న మీద కోపంతో ఇక్కడ పార్టీ పెట్టిందని విమర్శ 
KTR slams YS Sharmila

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ మీడియా చానల్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై స్పందించారు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిలపైనా తన అభిప్రాయాలు పంచుకున్నారు. అసలు షర్మిల ఎవరు? ఆమెకు ఇక్కడేం పని? అని ప్రశ్నించారు. అత్తమీద కోపం దుత్త మీద చూపించినట్టు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందని అన్నారు. అన్న మీద కోపం ఉంటే ఏపీలో పార్టీ పెట్టుకోవాలని కానీ, తెలంగాణలో ఏర్పాటు చేస్తే ఏంలాభం? అని అభిప్రాయపడ్డారు. 

అసలు, తెలంగాణలో షర్మిలకు ఏమైనా భాగస్వామ్యం ఉందా? అని నిలదీశారు. షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని, చచ్చేదాకా వ్యతిరేకించిన వ్యక్తి అని తెలిపారు. ఇవాళ వచ్చి నేను తెలంగాణ బిడ్డను అంటే షర్మిలను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరని కేటీఆర్ స్పష్టం చేశారు. 

షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వారు లేస్తే కేసీఆర్ పై బూతుపురాణాలు వినిపిస్తుంటారని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఎంత అన్యాయం చేసినా తాము ప్రధాని మోదీని ఒక్క మాట కూడా అనబోమని, కానీ ఇలాంటి వాళ్లు ఎవరి ఏజెంట్లు? ఈ శిఖండి సంస్థలను ఎవరు పుట్టించారు? నరేంద్ర మోదీ గారా, బీజేపీనా? అనేది ఆలోచించుకోవాలని అని అన్నారు.

More Telugu News