Ola Electric: టెస్లా, హ్యూందాయ్, జీఎం విద్యుత్ వాహనాలకు ప్రమాదాలు జరగలేదా?: ఓలా బైక్ ప్రమాదంపై సంస్థ సీఈవో కామెంట్

  • లోపాలున్న కంపెనీలకు జరిమానా సబబే
  • మా బైకులవి యూరోపియన్ ప్రమాణాలు
  • లోపాలు లేవని అనట్లేదంటూ కామెంట్
Ola Electric CEO Response On Central Govt Decision to fine companies

ఇటీవలి కాలంలో విద్యుత్ బైకులు వరుసగా పేలుళ్ల బారిన పడుతున్నాయి. మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బైకుల తయారీ సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎలక్ట్రిక్ బైకుల తయారీలో నిబంధనలు ఉల్లంఘించే సంస్థలు, బైకులను లోపాలపుట్టగా మార్చే సంస్థలకు జరిమానాలు వేస్తామని కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. 

ఆ వ్యాఖ్యలపై ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ స్పందించారు. అలాంటి చర్యలను తీసుకుంటే మంచిదేనని స్వాగతించారు. తమ సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ బైకులు నాణ్యమైనవని చెప్పారు. తమ స్కూటర్లలో సమస్యలు రావడం చాలా అరుదన్నారు. ఇటీవల పూణెలో ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటనపై స్పందించిన ఆయన.. ఎలక్ట్రిక్ బైకులుగానీ, పెట్రోల్ తో నడిచే బైకులకుగానీ ప్రమాదాలు జరగడం సహజమని అన్నారు. ‘‘ప్రపంచంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు ప్రమాదం జరగలేదా? హ్యూందాయ్, జీఎం వంటి కంపెనీల కార్లకూ ప్రమాదాలు జరిగాయి కదా’’ అని అన్నారు.  చేయాల్సిందల్లా ప్రమాణాలను మెరుగుపరచుకోవడమేనని, నాణ్యతా చెకింగ్ లను పటిష్ఠంగా చేయాలని అన్నారు. 

తమ స్కూటర్లలో అసలు సమస్యలే లేవని అనట్లేదని, అయితే, సమస్యలు అరుదని, సాఫ్ట్ వేర్ కు సంబంధించిన సమస్యలే ఉన్నాయని స్పష్టం చేశారు. ఓలా స్కూటర్ కాలిపోయిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. దానికి సంబంధించిన నివేదిక అందాల్సి ఉందన్నారు. ఎలక్ట్రిక్ బైకుల విషయంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలకే తాము పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. 

తమ ఈవీలను ఎగుమతి చేస్తున్నందున యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నామని భవీశ్ చెప్పారు. లోపాలతో కూడిన బైకులను తయారు చేసే సంస్థలకు జరిమానా వేయడాన్ని తాను సమర్థిస్తున్నట్టు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలన్నీ నాణ్యమైన బైకులను మార్కెట్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, అందుకు కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. 

More Telugu News