Prashant Kishor: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే తొలుత ఈ పనిచేయాలి: ప్రశాంత్ కిషోర్

  • కార్యకర్తలతో అధిష్ఠానం సంబంధాలు కోల్పోయిందన్న పీకే
  • పనిచేయని వృద్ధ నేతలను పక్కనపెట్టాలని సూచన
  • పనితీరు, ప్రజాబలం ఆధారంగా నేతలను గుర్తించాలన్న ప్రశాంత్ కిషోర్
keep aside senior leaders prashant kishor suggested congress

కాంగ్రెస్ ఒక దిశానిర్దేశం లేని పార్టీగా మారిపోయిందని, ఈ పరిస్థితుల్లో మార్పు వస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధమైన ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే పార్టీలో తొలుత చేయాల్సిన సంస్థాగత మార్పులపై అధిష్ఠానానికి ఇటీవల పలు సూచనలు ఇచ్చారు. అందులో భాగంగా పార్టీని కింది నుంచి బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో అధిష్ఠానం సంబంధాలు కోల్పోయిందని, వీటిని పునరుద్ధరిస్తేనే పార్టీ తిరిగి గాడిన  పడుతుందని ఆయన సూచించినట్టు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

పార్టీ నేతలు,  కార్యకర్తలతో సంబంధాల విషయంలో బీజేపీ మెరుగ్గా ఉందని, కార్యకర్తలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తుందని పీకే అన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో 70 శాతం జిల్లా అధ్యక్షులతో ఇంత వరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కానీ, రాహుల్ గానీ సమావేశాలు నిర్వహించలేదని అన్నారు. అంతేకాదు, ఢిల్లీ స్థాయిలో ఉన్న నేతలు బ్లాక్ అధ్యక్షులతో సమావేశం కాలేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలన్న ఆయన పార్టీలోని వృద్ధ నేతలను పక్కన పెట్టాలని, పనితీరు, ప్రజాబలం ఆధారంగా నేతలను గుర్తించాలని, లేదంటే పార్టీ భవిష్యత్ ఉండదని పీకే పేర్కొన్నట్టు సమాచారం. రాజస్థాన్‌లో జరగనున్న మేధోమదన సదస్సులో పార్టీ నిర్మొహమాటంగా అన్ని అంశాలను చర్చించాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది.

More Telugu News