Cricket: వాళ్లకు వాళ్లు అసలేమనుకుంటున్నారో..!: పంత్ నో బాల్ వ్యవహారంపై కెవిన్ పీటర్సన్ మండిపాటు

  • పంత్, ప్రవీణ్ ఆమ్రే చేసింది ముమ్మాటికీ తప్పేనన్న పీటర్సన్ 
  • పాంటింగ్ ఉంటే ఈ తప్పు జరిగేది కాదని కామెంట్
  • వెనక్కు వచ్చేయాలంటూ పంత్ పిలవడం సమంజసం కాదన్న ఇంగ్లండ్ క్రికెటర్
Kevin Peterson Response On No Ball Issue

నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ చతికిల పడింది. చివరి ఓవర్ లో రోవ్ మన్ పావెల్ మూడు వరుస సిక్సర్లు బాదేసరికి ఢిల్లీ అభిమానుల్లో ఏదో మూలన గెలుస్తామన్న చిన్న ఆశ చిగురించింది. 

అయితే, ఇంతలోనే మూడో బంతి నడుము ఎత్తులో వచ్చినా అంపైర్లు నో బాల్ ఇవ్వకపోవడంతో ఢిల్లీ సారథి రిషభ్ పంత్, జట్టు సహాయ కోచ్ ప్రవీణ్ ఆమ్రేలు మైదనాంలోకి వచ్చి హంగామా చేశారు. పెద్ద రచ్చే జరిగింది. ఈ వ్యవహారం ఇంగ్లండ్ మాజీ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కు ఆగ్రహం తెప్పించింది. పంత్, ప్రవీణ్ ఆమ్రేపై అతడు మండిపడ్డాడు. 

ఈ వ్యవహారంతో రోవ్ మన్ పావెల్ ఏకాగ్రత దెబ్బతిని ఉంటుందని పీటర్సన్ అన్నాడు. రిషభ్ పంత్ తీరుతోనే మ్యాచ్ పై ఏకాగ్రత కోల్పోయి ఉంటాడన్నాడు. అంపైర్ నిర్ణయం కన్నా పంత్ చర్యే మరింత ఆందోళన కలిగించేలా ఉందని వ్యాఖ్యానించాడు. రికీ పాంటింగ్ ఉండి ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదన్నాడు. ఇలాంటి చర్యకు పాల్పడినందుకు పంత్ ను జోష్ బట్లర్ ప్రశ్నించే హక్కు ఉందని పేర్కొన్నాడు. 

ఓ గొప్ప ఆట ఆడుతున్నామని, జనం పొరపాట్లు చేయడం సహజమేనని పీటర్సన్ చెప్పాడు. బ్యాట్ కొనంచుకు తగిలి నాటౌట్ గా ప్రకటించడం, తగలకపోయినా అవుట్ ఇవ్వడం తమకు ఎన్నిసార్లు జరగలేదని చెప్పుకొచ్చాడు. నాటౌట్ అయినా ఎన్నిసార్లు ఎల్బీడబ్ల్యూగా అవుట్ ఇవ్వలేదూ? అని గత సంఘటనలను గుర్తు చేశాడు. 

రిషబ్ పంత్, ప్రవీణ్ ఆమ్రేలు చేసింది ముమ్మాటికే పెద్ద తప్పేనని తేల్చి చెప్పాడు. వాళ్లకు వాళ్లు అసలు ఏమనుకుంటున్నారోనని మండిపడ్డాడు. క్రీజులో ఉన్న వాళ్లను పెవిలియన్ కు వచ్చేయాలంటూ పంత్ పిలవడం సమంజసం కాదన్నాడు. తామెప్పుడూ ఇలాంటి ఆట ఆడలేదని, తానున్నన్ని నాళ్లూ ఇలాంటి చర్యలు చూడలేదని పీటర్సన్ చెప్పాడు.

More Telugu News