KTR: దేశంలో మో'డెమోక్ర‌సీ'.. ప్రధానిపై కేటీఆర్ చురక

  • వ‌రంగ‌ల్‌కు రైల్వో కోచ్ ఫ్యాక్ట‌రీ ఇస్తామ‌న్నారన్న కేటీఆర్ 
  • తాజాగా గుజ‌రాత్‌కు కోచ్ ఫ్యాక్టరీ కేటాయించారని విమర్శ 
  • తెలంగాణ‌ను మోస‌గించారన్న కేటీఆర్‌
ktr harsh comments on pm narendra modi

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దేశంలో అమ‌లు అవుతున్న‌ది డెమోక్ర‌సీ కాద‌ని, ఇది మోదీ మార్కు డెమోక్ర‌సీ అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. యావ‌త్తు దేశాన్ని ఒకే దృష్టితో చూడాల్సిన ప్ర‌ధాని మోదీ... అందుకు విరుద్ధంగా త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్ కోస‌మే ప‌నిచేస్తున్నార‌ని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు తెలంగాణ ప‌ట్ల కేంద్రం స‌వతి త‌ల్లి ప్రేమ చూపుతోందంటూ కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

వ‌రంగ‌ల్‌కు కేంద్రం ప్ర‌క‌టించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్ప‌టికీ రాక‌పోగా.. గుజ‌రాత్‌కు మాత్రం ఎల‌క్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ ప్రాజెక్టును ప్ర‌క‌టిస్తూ కేంద్రం ఇటీవలే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌పై తెలంగాణ‌కు చెందిన రాజ‌కీయ విశ్లేష‌కుడు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. దానిని ఉద‌హ‌రిస్తూ మోదీపై కేటీఆర్ విరుచుకుప‌డ్డారు.

దేశంలో మో'డెమోక్ర‌సీ' అమ‌లులో ఉంద‌ని చెప్పిన కేటీఆర్‌... ప్ర‌ధాని మోదీ దృష్టి మొత్తం గుజ‌రాత్ అభివృద్ధిపై ఉంద‌ని దెప్పి పొడిచారు. ఆఫ్ గుజ‌రాత్‌, బై గుజ‌రాత్‌, ఫ‌ర్ గుజ‌రాత్‌, టూ గుజ‌రాత్ అన్న సూత్రంతోనే మోదీ ప‌నిచేస్తున్నార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. పార్ల‌మెంటు సాక్షిగా వ‌రంగ‌ల్‌కు ఇస్తామ‌న్న లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్ట‌రీ హామీని మోదీ తుంగ‌లో తొక్కార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

More Telugu News