India: సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్ లా పొంగిపోయా.. భారత్ పర్యటనపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

  • ప్రధాని మోదీ నిఖార్సైన స్నేహితుడన్న బోరిస్ 
  • దీపావళి నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారని వెల్లడి  
  • రక్షణ పరికరాల ఎగుమతులపై భారత్ కు ప్రత్యేకంగా లైసెన్స్ ఇస్తామని వ్యాఖ్య 
  • రక్షణ రంగంలో కొత్త బంధానికి నాంది అన్న బ్రిటన్ ప్రధాని 
I Felt Like Sachin and Amitab Says Boris Johnson

భారత పర్యటనపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో లభించిన అమోఘమైన స్వాగతానికి తాను ఫిదా అయ్యానన్నారు. స్వాగత ఏర్పాట్లతో కూడిన హోర్డింగులు చూసి.. తాను సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లా పొంగిపోయానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ నిఖార్సైన స్నేహితుడని చెప్పుకొచ్చారు. 

భారత్ తో బంధాన్ని మరింత దృఢం చేసుకునే అనేక అంశాలపై తాము చర్చించామని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. దీపావళి నాటికి స్వేచ్ఛా వాణిజ్యంపై ఒప్పందాన్ని ఖరారు చేస్తామన్నారు. దీపావళి నాటికి విధివిధానాలకు తుదిరూపునివ్వాల్సిందిగా అధికారులను కోరామన్నారు. పలు వస్తువులు, సామగ్రిపై భారత్ టారిఫ్ లను తగ్గించడం అభినందనీయమని, అందుకు బదులుగా తాము కూడా కొన్ని టారిఫ్ లను తగ్గిస్తున్నామని ప్రకటించారు. 

రక్షణ పరికరాలు, ఉత్పత్తులకు సంబంధించి డెలివరీ టైమ్ ను తగ్గిస్తున్నామని, భారత్ కు ప్రత్యేకంగా జనరల్ ఎక్స్ పోర్ట్ లైసెన్స్ ను రూపొందిస్తున్నామని చెప్పారు. రక్షణ రంగంలో సరికొత్త విస్తృత భాగస్వామ్యానికి నాంది పడిందన్నారు. ఇండో పసిఫిక్–రీజియన్ లో భద్రతను పెంపొందించేందుకు భారత్ తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. భారత్ కు యుద్ధ విమానాల కొత్త సాంకేతికతలు, హెలికాప్టర్లు, జలాంతర్గాముల వంటి వాటిని అందజేస్తామన్నారు.

More Telugu News