Prime Minister: ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన నేపథ్యంలో భారీ ఆత్మాహుతిదాడికి కుట్ర.. ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

  • అమరుడైన ఒక సీఐఎస్ఎఫ్ జవాను
  • ఉగ్రవాదులు జైషే మహ్మద్ కు చెందిన వారిగా గుర్తింపు
  • ఆత్మాహుతి దాడులకు కుట్రపన్నారన్న అధికారులు
  • మరింత మంది ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట
Encounter In Jammu Killed 2 Terrorists and One CISF Jawaan

ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్ర పన్నారు. ఆత్మాహుతి దాడులకు తెరలేపారు. ప్రధాని పర్యటనకు 48 గంటల ముందే ఓ ఎన్ కౌంటర్ జరగడంతో ఆందోళన రేకెత్తుతోంది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భారీ ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని నిఘా విభాగం ముందే అప్రమత్తం చేయడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 

ఈ క్రమంలోనే జమ్మూలోని సంజ్వాన్ సైనిక చెక్ పోస్టు వద్ద ఇవాళ ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఐఎస్ఎఫ్ అధికారి చనిపోగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. చనిపోయిన జవానును ఏఎస్సై ఎస్.పి. పటేల్ గా గుర్తించారు. 

మరణించిన వారిలో ఒక వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసేందుకు ఒంటిపై బాంబులను చుట్టుకున్నాడని, నగరంలో ఫిదాయీ తరహా దాడులకు కుట్ర పన్నాడని అధికారులు చెప్పారు. ఇవాళ తెల్లవారుజామున 3.45 గంటలకు ఉగ్రవాదులు ఓ ఇంట్లో చొరబడి సైన్యంపై కాల్పులు జరిపారని, బదులుగా సైన్యమూ కాల్పులు జరిపిందని తెలిపారు.ప్రస్తుతం మరింత మంది ఉగ్రవాదుల కోసం గాలింపు జరుగుతోందని పేర్కొన్నారు. 

కాగా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యగా మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపేశారు. డ్రోన్లను రంగంలోకి దించి ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చేస్తున్నారు.

హతమైన ఉగ్రవాదులను పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. వాస్తవానికి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ సాంబా జిల్లాలోని పాళి గ్రామంలో పర్యటించనున్నారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ఉగ్రవాదులు భారీ ఉగ్రదాడికి కుట్రపన్నినట్టు తెలుస్తోంది. 

ఇప్పుడు ఆ కుట్రను భగ్నం చేసే క్రమంలో.. ఆ గ్రామానికి కేవలం 24 కిలోమీటర్ల దూరంలోనే ఉగ్రవాదులతో ఎన్ కౌంటర్ జరగడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ యూసుఫ్ కంత్రూను కశ్మీర్ లోని బారాముల్లాలో బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

More Telugu News