MS Dhoni: ఓపిక పట్టు.. ఆ తర్వాత చితక్కొట్టు.. ప్రిటోరియస్ కు ధోనీ సూచన

  • చివరి ఓవర్లో 17 పరుగులు పిండుకున్న చెన్నై
  • వీటిలో 16 పరుగులు ధోనీ చేసినవే
  • మ్యాచ్ ఫినిషింగ్ లో ధోనీ మాస్టర్ అన్న ప్రిటోరియస్
MS Dhonis instructions for Dwaine Pretorius before masterclass

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి తన అద్భుత ప్రతిభను అభిమానులకు గుర్తు చేశాడు. ముంబైతో గురువారం రాత్రి నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అభిమానులకు ఆద్యంతం ఆసక్తి, ఉత్కంఠను కలిగించింది. చివరి ఓవర్లో ధోనీ బ్యాట్ తో వీరోచితంగా పోరాడి చెన్నైకు చక్కని విజయాన్ని అందించాడు. 

ఇక విజయం కోసం చెన్నై 17 పరుగులు చేయాలి. 20వ ఓవర్లో ఉనద్కత్ తన తొలి బంతికే ప్రిటోరియస్ వికెట్ ను పడగొట్టాడు. రెండో బంతికి బ్రావో సింగిల్ తీసి ధోనీకి స్ట్రయిక్ వచ్చేలా చేశాడు. ఇక అంతే.. విజయాన్ని ధోనీ తన బ్యాట్ తో డిసైడ్ చేశాడు.

మూడో బంతి సిక్స్, నాలుగో బంతి ఫోర్, ఐదో బంతికి రెండు పరుగులు, ఆరో బంతికి మరో బౌండరీ.. అంతే.. విజయం ఖాయమైపోయింది. మ్యాచ్ ను తను అంత అద్భుతంగా మరొకరు ఫినిష్ చేయలేరని ధోనీ మరోసారి నిరూపించాడు. దీనిపై ప్రిటోరియస్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ‘‘నమ్మలేకపోతున్నాను. ఆటను ముగించడంలో అతడు (ధోనీ) మాస్టర్. అతను మరోసారి ఈ రాత్రి (గురువారం) దాన్ని చేసి చూపించాడు’’ అని డ్వానో ప్రిటోరియస్ అన్నాడు. 

సీఎస్కే విజయంలో ప్రిటోరియస్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. 14 బంతుల్లోనే 22 పరుగులు పిండుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా చివరి ఓవర్లో వేసిన బంతిని బౌండరీకి పంపించాడు. అసలు 17వ ఓవర్లోనే ఆవేశంగా విరుచుకుపడదామనుకున్నాడు. కానీ, ధోనీయే కాస్త వేచి చూడాలని సూచించినట్టు ప్రిటోరియస్ వెల్లడించాడు. ధోనీ సూచనతో తొలి ఓవర్ కాస్త కుదురుకున్న ప్రిటోరియస్ ‘నేను ఇప్పుడు ముందుకు వెళుతున్నా’ అని ధోనికి చెప్పడంతో అతడు ఓకే చెప్పాడట. ‘‘జట్టు విజయానికి కృషి చేసినందుకు సంతోషంగా ఉందని.. మరిన్ని విజయాలు సొంతం చేసుకోగలమని ప్రిటోరియస్ పేర్కొన్నాడు. 

More Telugu News