Vijayawada: విజయవాడలో దారుణం.. ప్రభుత్వాసుపత్రిలో బంధించి సామూహిక అత్యాచారం

  • పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి
  • అతడి మాటలు నమ్మి బ్యాగు సర్దుకుని ఆసుపత్రికి వచ్చేసిన యువతి
  • మరో ఇద్దరితో కలిసి అత్యాచారం చేసిన వైనం
  • నిందితులపై దిశ చట్టం కింద కేసు నమోదు
  • బాధితురాలికి రూ. 5 నుంచి రూ. 10 లక్షల పరిహారం ఇస్తామన్న పోలీస్ కమిషనర్
GGH Outsourcing Employee Gang Raped with his Friends in Vijayawada GGH

విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. మతిస్థిమితం సరిగా లేని యువతిపై ప్రేమ వల విసిరిన ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చి ఓ గదిలో బంధించాడు. ఆపై మరో ఇద్దరితో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని పాయకాపురం వాంబే కాలనీకి చెందిన దారా శ్రీకాంత్ (26) ప్రభుత్వాసుపత్రిలో పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్టర్ వద్ద ఫాగింగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి సమీపంలో నివసించే 23 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమ వల విసిరాడు. పెళ్లి చేసుకుంటానని, తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో ఉద్యోగం కూడా ఇప్పిస్తానని నమ్మబలికాడు.

అతడి మాటలు నమ్మిన యువతి ఈ నెల 19న ఇంట్లో చెప్పకుండా బ్యాగులో దుస్తులు సర్దుకుని శ్రీకాంత్ పనిచేసే ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. శ్రీకాంత్ సరుకులు భద్రపరుచుకునే చిన్న గదిలో ఆమెను ఉంచాడు. అదే రోజు రాత్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విషయాన్ని తోటి ఉద్యోగి బాబూరావుకు చెప్పడంతో అతడు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతడు తన స్నేహితుడైన జె.పవన్ కల్యాణ్‌ను ఆసుపత్రికి రప్పించాడు. అనంతరం ముగ్గురూ కలిసి మరోమారు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. 

మరోవైపు, కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ శ్రీకాంత్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దిశ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం పాత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమెకు నష్టపరిహారంగా రూ. 5నుంచి రూ. 10 లక్షలు అందిస్తామని పోలీస్ కమిషనర్ కాంతిరాణా తెలిపారు.

More Telugu News