Lakshman: భద్రాద్రి రాముడి పేరు పెట్టుకున్నారు కదా, ఏనాడైనా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారా?: కేటీఆర్ పై బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్

  • పాతబస్తీలో అధికారులపై దాడులు
  • తీవ్రంగా స్పందించిన బీజేపీ నేత లక్ష్మణ్
  • పాతబస్తీలో తనిఖీలు చేసే దమ్ముందా? అంటూ టీఆర్ఎస్ కు సవాల్
  • ఒవైసీ మెప్పుకోసం కేటీఆర్ మాట్లాడుతున్నాడని విమర్శలు
BJP leader Dr Lakshman fires on Telangana minister KTR

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని టపాఛబుత్ర ప్రాంతంలో విద్యుత్ బకాయిలు చెల్లించాలని కోరిన అధికారిపై కొందరు యువకులు కార్యాలయంలో దాడి చేయడం, ఇటీవల పోలీసులపై ఓ కార్పొరేటర్ జులుం తదితర ఘటనలపై బీజేపీ నేత లక్ష్మణ్ స్పందించారు. పోలీసులు, ఇతర అధికారులపై మజ్లిస్ దాడులు చేస్తున్నా టీఆర్ఎస్ స్పందించడంలేదని అన్నారు. 

అసలు పాతబస్తీకి వెళ్లి తనిఖీలు చేసే దమ్ము టీఆర్ఎస్ పార్టీకి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసం టీఆర్ఎస్ నేతలు భిక్షగాళ్ల మాదిరి తయారయ్యారని విమర్శించారు. మంత్రి కేటీఆర్ తీరు చూస్తుంటే మజ్లిస్ నేతలా మాట్లాడుతున్నారని, అసదుద్దీన్ ఒవైసీ మెప్పుకోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని లక్ష్మణ్ మండిపడ్డారు. 

భద్రాద్రి రామయ్య పేరు పెట్టుకున్న కేటీఆర్ ఏనాడైనా ఆ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారా? చార్మినార్ వద్ద మసీదుకు వెళ్లే కేటీఆర్, అక్కడే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ఎప్పుడైనా అమ్మవారి దర్శనం చేసుకున్నారా? అని నిలదీశారు. దారుస్సలాం ఆదేశాలకు లోబడి పనిచేసే మీరా బీజేపీని విమర్శించేది? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. 

'పాతబస్తీలో తనిఖీలు చేపట్టలేరు... కనీసం విద్యుత్ బకాయిలు వసూలు చేసే దమ్ము కూడా లేదు' అంటూ వ్యాఖ్యానించారు. మజ్లిస్ కన్నెర్ర చేస్తే పాతబస్తీలో అడుగుపెట్టలేని దుస్థితి టీఆర్ఎస్ పార్టీది అని విమర్శించారు.

More Telugu News