Cricket: నా మొహం చూస్తే ఎలా కనిపిస్తోందంటూ రోహిత్ తో సూర్యకుమార్ ఘాటుగా అన్న వేళ...

  • గత ఆస్ట్రేలియా పర్యటనపై సూర్య వ్యాఖ్య
  • జట్టులో చోటు దక్కనందుకు బాధపడ్డానని వెల్లడి
  • బాధపడుతున్నావా? అని అడిగిన రోహిత్
  • నీకు తెలియదా? అంటూ సూర్య సమాధానం
  • తన వెన్నంటే రోహిత్ ఉన్నాడని వ్యాఖ్య
SKY Interesting Comments On Skipper Rohit Sharma

ప్రతిభ ఉన్న ఆటగాళ్లలో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ (స్కై) ముందుంటాడు. జట్టుకు కావాల్సినప్పుడల్లా అదరగొడుతూ తన అవసరమేంటో చాటి చెబుతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అలాంటి సూర్యకుమార్ యాదవ్ కు 2020లో ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులో చోటు దక్కలేదు. దానిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ వెన్ను తట్టి ప్రోత్సహించాడని స్కై చెప్పాడు. 

నాడు రోహిత్ తో జరిగిన ఘటన గురించి గౌరవ్ కపూర్ యూట్యూబ్ షో ‘బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్’లో మాట్లాడాడు. ‘‘ఆ రోజు నా పుట్టినరోజు. రోహిత్ వచ్చి శుభాకాంక్షలు చెప్పాడు. నీకు ఇండియా క్యాప్ ఎంతో దూరంలో లేదన్నాడు. ప్రతిసారీ నా వెన్నంటే ఉన్నాడు. పరుగులు చేస్తూ ఉండు అంటూ ప్రోత్సహించాడు. ఒక మ్యాచ్ లో మంచి స్కోర్ చేశావా.. ఇంకో మ్యాచ్ లోనూ చేయి. ఆ తర్వాత ఇంకో మ్యాచ్. అవకాశం అనే తలుపును తడుతూనే ఉండాలంటూ సూచించాడు’’ అని సూర్య పేర్కొన్నాడు. 

ఐపీఎల్ వచ్చాక పలు దేశాల పర్యటనలకుగానూ 2 నుంచి 3 జట్లను ప్రకటిస్తున్నారని, కానీ వేటిలోనూ తనకు ఆస్ట్రేలియా పర్యటనలో అవకాశం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటికి తన ఫాం బాగానే ఉండడంతో తాను ఎంపిక కావడం ఖాయమంటూ అందరూ చెప్పారని, కానీ, జట్టులో తన పేరు లేకపోయేసరికి తప్పు ఎక్కడ జరిగిందని తీవ్రంగా వేదనపడ్డానని చెప్పాడు. 

ఈ క్రమంలోనే రోహిత్ ఒకసారి తన దగ్గరకు వచ్చి.. ‘‘జట్టులో చోటు దక్కనందుకు బాధగా ఉందా?’’ అని అడిగాడని చెప్పాడు. అయితే, ‘‘నా మొహం చూస్తే ఎలా కనిపిస్తోంది? నీకు తెలియదా? నీకు కచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది’’ అని కొంచెం ఘాటుగానే అన్నాను. ప్రతి విషయంలోనూ రోహిత్ తన వెనకే ఉన్నాడని, భుజం తట్టి ప్రోత్సహించేవాడని సూర్య చెప్పుకొచ్చాడు.

More Telugu News