SRH: తమ స్టార్ ఆటగాడి పేరు పక్కన 'నాయుడు' చేర్చిన సన్ రైజర్స్ టీమ్

  • ఐపీఎల్ లో దూసుకుపోతున్న సన్ రైజర్స్
  • వరుసగా నాలుగు విజయాలు
  • కీలకపాత్ర పోషిస్తున్న అయిడెన్ మార్ క్రమ్
  • 'మార్ క్రమ్ నాయుడు' అంటూ సన్ రైజర్స్ ట్వీట్
Sunrisers makes Markram as Naidu

ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం అద్భుతంగా సాగుతోంది. తొలి రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయ్యాక ఆ జట్టు గొప్పగా పుంజుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్ లలో నెగ్గి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. సన్ రైజర్స్ ఆటతీరులో ఇంతమార్పు రావడం చూసి అభిమానులే విస్మయానికి గురవుతున్నారు. 

కాగా, సన్ రైజర్స్ విజయాల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు అయిడెన్ మార్ క్రమ్ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. మ్యాచ్ లో సరైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ సిసలైన ఫినిషర్ అనిపించుకుంటున్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లోనూ మార్ క్రమ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతుల్లో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లోనూ ఈ సఫారీ స్టార్ 68 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

సన్ రైజర్స్ ఆడిన ఇటీవలి మ్యాచ్ లు పరిశీలిస్తే... మార్ క్రమ్, నికోలాస్ పూరన్ మ్యాచ్ లను ముగిస్తున్నారు. వారి తర్వాత వారికి బ్యాటింగ్ చేసే అవకాశమే లభించడంలేదు. 

ఈ క్రమంలో సన్ రైజర్స్ టీమ్ మార్ క్రమ్ ను తెలుగువాడిగా మార్చేసింది. మార్ క్రమ్ పేరు పక్కన 'నాయుడు' చేర్చి 'మార్ క్రమ్ నాయుడు'గా పిలుస్తోంది. నిన్న పంజాబ్ కింగ్స్ పై గెలిచాక హోటల్ లో మార్ క్రమ్ కు కోచ్ టామ్ మూడీ బహుమతులు ఇచ్చాడు. దీని గురించిన ట్వీట్ లోనూ 'ఎండ్ గేమ్ స్పెషలిస్ట్  మార్ క్రమ్ నాయుడు' అనే పేర్కొన్నారు. దీనిపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నాయుడు ఏంటబ్బా అని విస్మయానికి గురవుతున్నారు.

More Telugu News