Daggubati Purandeswari: నారా లోకేశ్ కి నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి: పురందేశ్వరి

  • నారా లోకేశ్ సొంత లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చన్న పురందేశ్వరి 
  • తన భర్త, కుమారుడు వైసీపీలో లేరని వెల్లడి 
  • ఏ పార్టీలో ఉండాలనేది తన కుమారుడి ఇష్టమని వ్యాఖ్య 
My blessings always with Nara Lokesh says Purandeswari

టీడీపీ నేత నారా లోకేశ్ ను ఉద్దేశించి బీజేపీ నాయకురాలు పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి నాయకత్వం వహించబోయేది నారా లేకేశే అంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో... టీడీపీని నడిపించే సామర్థ్యం లోకేశ్ కు ఉందా? లోకేశ్ పెద్దమ్మగా మీరు ఏమి చెపుతారు? అంటూ ఓ మీడియా చానల్ అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 

లోకేశ్ తల్లి భువనేశ్వరి సోదరిగా తన ఆశీర్వాదాలు లోకేశ్ కి ఎప్పుడూ ఉంటాయని ఆమె చెప్పారు. ఆయన సొంత లక్ష్యాలను. మార్గాన్ని ఆయన నిర్దేశించుకోవచ్చని అన్నారు.  

ఇక తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేశ్ చెంచురామ్ ఇద్దరూ వైసీపీలో లేరని పురందేశ్వరి స్పష్టం చేశారు. తన కుమారుడు హితేశ్ పుట్టుకతోనే అమెరికా పౌరుడని చెప్పారు. యూఎస్ సిటిజెన్ షిప్ ను వదులుకునే ప్రక్రియలో జాప్యం జరిగిందని... అందువల్ల గత ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేయాలనే ఒత్తిడి తన భర్త వెంకటేశ్వరరావుపై పడిందని, అందుకే ఆయన పోటీ చేశారని చెప్పారు.

కుటుంబంలో ఎవరో ఒకరు రాజకీయాల్లో ఉండాలనే భావన తన భర్తదని అన్నారు. తాము వేర్వేరు పార్టీలలో ఉండటం సమంజసం కాదనేది ఆయన అభిప్రాయమని... అందువల్ల ఆయన వైసీపీకి దూరం జరిగారని తెలిపారు. తన భర్త, కుమారుడు ఇద్దరూ వైసీపీలో లేరనేది చాలా స్పష్టమైన విషయమని చెప్పారు.  

తన కుమారుడు ప్రస్తుతం బిజినెస్ చూసుకుంటున్నారని.. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉందని... రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషించాలా? వద్దా? ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి? అనే నిర్ణయాలను హితేశ్ తీసుకుంటారని పురందేశ్వరి చెప్పారు. సొంత నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛను తాము తమ బిడ్డలకు ఇచ్చామని తెలిపారు.

More Telugu News