Hyderabad: రూ. 100 కోట్ల స్థల వివాదం.. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌, ఆయన సోదరుడి కుమారుడిపై కేసు

  • బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో అర ఎకరానికి పైగా స్థలం
  • డెవలప్‌మెంట్ కోసం విశ్వప్రసాద్‌తో అగ్రిమెంట్
  • ఆదోని నుంచి మారణాయుధాలతో స్థలం వద్దకు 90 మంది
  • కాపాలదారులపై దాడి.. 63 మంది అరెస్ట్
Case Filed Against MP TG Venkatesh and TG Vishwa Prasad

దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన భూ వివాదానికి సంబంధించిన కేసులో ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, ఆయన సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్‌పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు నంబరు 10లో ఏపీ జెమ్స్ అండ్ జువెల్లర్స్ పార్క్‌ కోసం 2005లో అప్పటి ప్రభుత్వం రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 

ఈ స్థలంలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారు. దీనికి ఆనుకుని ఉన్న మరో అర ఎకరానికిపైగా ఉన్న స్థలాన్ని కొందరు వ్యక్తులు.. టీజీ వెంకటేశ్ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత అయిన టీజీ విశ్వప్రసాద్‌తో ఇటీవల డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు కర్నూలు జిల్లా ఆదోని నుంచి దాదాపు 90 మంది మారణాయుధాలతో అక్కడికి చేరుకుని కాపలాదారులపై దాడికి పాల్పడ్డారు. 

విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకోగా, గమనించిన కొందరు పరారయ్యారు. మిగిలిన 63 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో టీజీ వెంకటేశ్, టీజీ విశ్వప్రసాద్, వీవీఎస్ శర్మ సహా మొత్తం 15 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. అలాగే, పట్టుబడిన వారిపై హత్యాయత్నం, అక్రమ ప్రవేశం, దాడి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News