WHO: భారత్ లో కరోనాకు 40 లక్షల మంది బలి.. డబ్ల్యూహెచ్ వో విధానాన్ని తప్పుబట్టిన కేంద్రం

  • ఇలాంటి విధానం చిన్న దేశాలకు చెల్లుతుంది
  • 130 కోట్ల జనాభా ఉన్న భారత్ కు కాదు
  • కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన
India objects to WHOs methodology after report claims 4 million Covid deaths

భారత్ లో కరోనా మహమ్మారికి 40 లక్షల మంది మరణించారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) చేసిన ప్రకటనను కేంద్ర సర్కారు ఖండించింది. కరోనా మరణాలను లెక్కించేందుకు అనుసరించిన విధానం సరిగా లేదని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. తక్కువ జనాభా ఉన్న దేశాలకు అనుసరించిన విధానాన్నే.. భౌగోళికంగా, జనాభా పరంగా పెద్ద దేశమైన భారత్ విషయంలోనూ పాటించడం సరికాదని పేర్కొంది.

‘అంతర్జాతీయంగా కరోనా మరణాలను బహిర్గతం చేసే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నాలను భారత్ అడ్డుకుంటోంది’అంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందనగా భారత్ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశాలు అధికారికంగా ప్రకటించిన గణాంకాలతో పోలిస్తే కరోనా మరణాలు 1.5 కోట్లు అధికంగా ఉంటాయని డబ్ల్యూహెచ్ వో అంచనా. దేశాలన్నీ ప్రకటించిన మరణాల కంటే ఇది రెట్టింపు. భారత్ లో మరణాలు కనీసం 40 లక్షలుగా ఉంటాయని డబ్ల్యూహెచ్ వో తెలిపింది.  

‘‘డబ్ల్యూహెచ్ వో గణాంకాల పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. ఇందుకు అనుసరించిన విధానంపైనే మా అభ్యంతరం. చైనా, బంగ్లాదేశ్, ఇరాన్ సిరియా సైతం మరణాల లెక్కింపునకు అనుసరించిన విధానాన్ని ప్రశ్నించాయి. ఏవో కొద్ది శాంపిల్ సైజు వివరాలతో మరణాలను అంచనా కట్డడం ట్యునీషియా వంటి చిన్న దేశాలకు చెల్లుతుందేమో కానీ, 130 కోట్ల మంది ఉన్న భారత్ వంటి పెద్ద దేశాలకు కాదు. భారత్ నమూనా కచ్చితత్వంతో కూడుకున్నది’’అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.

More Telugu News