IPL 2022: ఓటమికి పూర్తి బాధ్యత నాదే: వరుస పరాజయాలపై రోహిత్ శర్మ

  • ఐపీఎల్‌లో వరుస పరాజయాలపై పెదవి విప్పిన రోహిత్
  • రాహుల్ లాంటి ప్రదర్శన తమ జట్టులో కరువైందని ఆవేదన
  • లోపం ఎక్కడుందో కనిపించడం లేదన్న కెప్టెన్
  • తిరిగి పుంజుకుంటామని ధీమా
I Take Full Responsibility Rohit Sharma After Mumbai Indians Slump To 6th Straight Defeat

ఐపీఎల్‌లో వరుస పరాజయాలపై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అంచనాలకు తగ్గట్టుగా జట్టును నడిపించలేకపోతున్నానని, అందుకు తనదే బాధ్యత అని చెప్పుకొచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది. రోహిత్ సేనకు ఇది వరుసగా ఆరో పరాజయం. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ వరుస వైఫల్యాలపై పెదవి విప్పాడు. తప్పు ఎక్కడ జరిగిందో తెలిస్తే సరిదిద్దుకోవచ్చని, కానీ అది కనిపించడం లేదని అన్నాడు. ప్రతి మ్యాచ్‌కు బాగానే సిద్ధమవుతున్నట్టు చెప్పాడు.

ప్రపంచం ఏమీ ఇప్పుడే అంతమైపోవడం లేదని, గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురైనా మళ్లీ పుంజుకున్నామన్నాడు. ఇప్పుడు కూడా తిరిగి గాడిన పడేందుకు ప్రయత్నిస్తామన్నాడు. వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిపోయామని, కాబట్టి జట్టు కూర్పుపై ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు చెప్పాడు. బౌలర్లు మరింతగా రాణించాల్సి ఉందన్నాడు. పరాజయాలు ఎదురైనప్పుడు తప్పులు వెతకడం చాలా సులభమన్నాడు. లక్నో కెప్టెన్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, తమ జట్టులో అలాంటి ప్రదర్శన లోపించిందని రోహిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.

More Telugu News