Merle Oberon: భారత్ లో పుట్టి హాలీవుడ్ ను ఏలిన తార ఎవరో తెలుసా...!

  • అనేక ఆంగ్ల చిత్రాల్లో నటించిన మేర్లీ ఓబెరాన్
  • ఆస్కార్ కు నామినేట్ అయిన నటి
  • అప్పటి బాంబేలో నటించిన మేర్లీ
  • భారత్ గురించి చాలా తక్కువగా ప్రస్తావించిన నటి
Merle Oberon a star who born in India

మేర్లీ ఓబెరాన్... ఇప్పటితరం హాలీవుడ్ సినిమా లవర్స్ కు ఈ పేరు తెలియకపోవచ్చు. కానీ, బ్లాక్ అండ్ వైట్ హవా నడిచిన కాలంలో ఆమె 1920వ దశకం నుంచి 70వ దశకం వరకు ఓ ఊపు ఊపింది. అప్పట్లో అనేక హిట్ చిత్రాలలో ప్రపంచవ్యాప్తంగా కుర్రకారు మదిలో చెరగని స్థానం సంపాదించుకుంది. 

సాధారణంగా హాలీవుడ్ లో రాణించే హీరోయిన్లు అంటే భారత ఉపఖండం వెలుపలివారే అయివుంటారని అందరూ భావిస్తుంటారు. ముఖ్యంగా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందినవారే హాలీవుడ్ లో ఎక్కువగా నటిస్తుంటారని చాలామంది నమ్ముతుంటారు. 

అయితే, 50కి పైగా చిత్రాల్లో నటించి, తన అందచందాలతో, అభినయంతో ప్రపంచదేశాల సినీ ప్రియులను రంజింపజేసి మేర్లీ ఓబెరాన్ భారత్ లో పుట్టారని చాలామందికి తెలియదు. 1911లో బాంబే (ఇప్పుడు ముంబయి)లో ఆమె ఓ ఆంగ్లో-ఇండియన్ గా జన్మించారు. ఆమె తండ్రి బ్రిటీష్ వ్యక్తి కాగా, ఆమె తల్లి సింహళీస్-మావోరీ సంతతికి చెందిన మహిళ. 

హాలీవుడ్ స్వర్ణయుగం అనదగ్గ కాలంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన మేర్లీ ఓబెరాన్ తన పుట్టుకకు సంబంధించిన వివరాలను చాలావరకు గోప్యంగా ఉంచారు. తనను తాను శ్వేతజాతీయురాలిగానే చెప్పుకునేవారు. 2009లో మయూఖ్ సేన్ అనే అమెరికా రచయిత, విద్యావేత్త ఆస్కార్ కు నామినేట్ అయిన దక్షిణాసియా సంతతికి చెందిన తొలి నటీమణిగా మేర్లీ ఓబెరాన్ ను గుర్తించాడు. ఆపై మరింత లోతుగా పరిశోధించి ఆమెకు సంబంధించిన అనేక అంశాలను వెల్లడించాడు. అందుకు 1983లో ఆమె జీవితచరిత్రపై వచ్చిన పుస్తకం ఎంతో సాయపడింది. 

ఆమె పూర్తి పేరు మేర్లీ ఓబ్రియాన్ థామ్సన్. 1914లో తండ్రి మరణించాక ఆమె కుటుంబం 1917లో కోల్ కతాకు తరలి వెళ్లింది. తల్లి పేరు చార్లోట్టే సెల్బీ. మేర్లీ ఓబెరాన్ 1920లో కోల్ కతాలోని అమెచ్యూర్ థియేట్రికల్ సొసైటీలో నటనలో ఓనమాలు దిద్దుకుంది. 1925లో ఆమె ది డార్క్ ఏంజెల్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో నటనకు గాను ఆమె ఆస్కార్ కు నామినేట్ అయింది. 

1928లో ఓ సైనికాధికారి సాయంతో ఫ్రాన్స్ వెళ్లింది. ఆ సైనికాధికారి ఆమెను చిత్ర దర్శకుడు రెక్స్ ఇంగ్రామ్ కు పరిచయం చేశాడు. ఆ సమయంలో తల్లి చార్లోట్టే సెల్బీ ఓ సేవకురాలి రూపంలో కుమార్తె వెన్నంటే ఉండేవారు. ఆమె నల్లగా ఉండడంతో మేర్లీ తల్లి అని ఎవరికీ అనుమానం వచ్చేది కాదు. ఆ తర్వాత చిత్ర రంగంలో ప్రవేశించిన మేర్లీ ఓబెరాన్ కు 1933లో సర్ అలెగ్జాండర్ కోర్డా తెరకెక్కించిన ది ప్రైవేట్ లైఫ్ ఆఫ్ హెన్రీ విల్ అనే చిత్రంతో బ్రేక్ లభించింది. ఆ తర్వాత కాలంలో సర్ అలెగ్జాండర్ కోర్డానే మేర్లీ పెళ్లాడింది. 

కాగా, తనను తాను పరిచయం చేసుకునే సమయంలో తాను ఆస్ట్రేలియాలోని హోబర్ట్ కు చెందినదాన్నని చెప్పుకునేది. తదనంతర రోజుల్లో ఆమె ఆస్ట్రేలియాలోనే స్థిరపడింది. టాస్మానియా రాష్ట్రాన్నే తన స్వస్థలంగా చెప్పేది తప్ప, ఎప్పుడో గానీ కోల్ కతా ప్రస్తావన తెచ్చేదికాదు. అయితే ఆమె హోబర్ట్ లో పుట్టారనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్న విషయాన్ని ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. కొంతవరకు ఆమె జన్మస్థలానికి సంబంధించిన అంశాలు వివాదాస్పదమయ్యాయి. 

ఆమె తన 68వ ఏట అమెరికాలో కన్నుమూసింది. మేర్లీ ఓబెరాన్ అలెగ్జాండర్ కోర్డాతో వైవాహిక బంధం తెగిపోయాక లూసియన్ బల్లార్డ్, బ్రూనో పగిలాయ్, రాబర్ట్ వోల్డెర్స్ లను పెళ్లాడింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏదేమైనా, ఓ హాలీవుడ్ అందాలభామకు భారతే పుట్టిల్లు అని మిగతా ప్రపంచానికి తెలిసింది.

More Telugu News