csk: సీఎస్కే ‘స్టార్స్’ను ఎలా తయారు చేస్తోందో తెలుసా..?

  • నెట్ బౌలింగ్ తోనే పునాది
  • మెప్పిస్తే మంచి అవకాశం తలుపుతట్టినట్టే
  • ధోనీ, సీనియర్ల నుంచి మంచి సూచనలు
  • అర్థం చేసుకుని కృషి చేస్తే జట్టులో చోటు
csk making stars like this net bowlers

‘వెటరన్స్ జట్టు’.. ‘వృద్ధ సింహాలు’.. సీఎస్కేను ఎక్కువ మంది ఇలానే కామెంట్ చేస్తుంటారు. గత సీజన్ వరకు కెప్టెన్ గా ఉన్న ధోనీ నుంచి, ఊతప్ప, రాయుడు, బ్రావో సహా ఇటీవల వేలంలో ఆర్సీబీకి వెళ్లిపోయిన డూప్లెసిస్ వరకు అందరూ సీనియర్లు కావడం వల్లే ఈ పేరు పడిపోయింది. 


కానీ, అనుభవం చాలా విలువైనది. అందుకే సీఎస్కే నాలుగు సార్లు ఛాంపియన్ గా అవతరించింది. సీనియర్లతోపాటు, మేటి సారథిగా గుర్తింపు పొందిన ధోనీ సీఎస్కే బలాలుగానే చూడాలి. యువ క్రికెటర్లను గుర్తించి, సానపట్టి వారితో చక్కని ఫలితాలను సాధించడంలో సీఎస్కేకు నైపుణ్యం ఉంది.  

సీఎస్కేకు ఈ సీజన్ లో ముంబై ఆఫ్ స్పిన్నర్ సల్మాన్ ఖాన్ నెట్ బౌలర్ గా సేవలు అందిస్తున్నాడు. ‘‘ఒక రోజు నాకు చెన్నై సూపర్ కింగ్స్ అధికారి నుంచి కాల్ వచ్చింది. ఈ సీజన్ కు నెట్ బౌలర్ గా చేరతావా? అని అడిగారు. నా పేరును ముంబై ప్లేయర్ తుషార్ దేశ్ పాండే సూచించినట్టు ఆ తర్వాత నాకు తెలిసింది. నాకు ఈ అవకాశం రావడం పట్ల ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. ఎందుకంటే నెట్ బౌలర్ గా నేర్చుకునే అవకాశం లభించింది. లేదంటే క్లబ్ క్రికెట్ కే పరిమితం కావాల్సి వచ్చేది’’ అని సల్మాన్ తెలిపాడు. 

సీఎస్కే నెట్ బౌలర్ల రూపంలో మంచి స్టార్స్ ను గుర్తించి మెరుగులు దిద్దుతుంటుంది. ఈ సీజన్ లో బౌలింగ్ తో రాణిస్తున్న ముకేశ్ చౌదరి, స్క్వాడ్ లో భాగమైన ప్రశాంత్ గతేడాది సీఎస్కేకు నెట్ బౌలర్లుగా పనిచేసిన వారే. మెగా వేలంలో పేర్ల నమోదుకు ప్రోత్సహించి, వారిని సీఎస్కే కొనుగోలు చేసింది. నెట్ బౌలింగ్ లో ధోనీ, రవీంద్ర జడేజాను మెప్పించినట్టయితే రానున్న సీజన్లలో సల్మాన్ సీఎస్కే స్క్వాడ్ లో ఒకడిగా అవకాశం సొంతం చేసుకోవడానికి వీలుంది. 

తన బౌలింగ్ ఎలా ఉందంటూ సల్మాన్ ఖాన్ ధోనీని అడిగితే.. ‘‘టీ20ల్లో ప్రతి ఒక్కరు ఆఫ్ స్పిన్నర్ బంతులను కొట్టడానికే ప్రయత్నిస్తుంటారు. కనుక నీ బౌలింగ్ కు ఆలోచన జోడించు’’ అని సలహా ఇచ్చినట్టు అతడు తెలిపాడు.

More Telugu News