Kolkata Knight Riders: దూకుడు పెంచిన సన్ రైజర్స్.. హైదరాబాద్ ఖాతాలో హ్యాట్రిక్ విజయం

  • కోల్‌కతాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం
  • అర్ధ సెంచరీలతో అదరగొట్టిన త్రిపాఠి, మార్కరమ్
  • నాలుగో స్థానానికి పడిపోయిన కేకేఆర్
Markram and Tripathi power SRH to third win

వరుస ఓటముల తర్వాత హైదరాబాద్ గాడినపడింది. వరుస విజయాలతో అదరగొడుతోంది. గత రాత్రి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్ అర్ధ సెంచరీలతో అదరగొట్టడంతో కోల్‌కతా నిర్దేశించిన 176 పరుగుల విజయ లక్ష్యం చిన్నబోయింది. ఈ పరాజయంతో కోల్‌కతా నాలుగో స్థానానికి పడిపోయింది. 

176 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్‌కు ఆరంభం అంత కలిసిరాలేదు. 3 పరుగుల వద్ద అభిషేక్ శర్మ (3), 39 పరుగుల వద్ద కెప్టెన్ కేన్ విలియమ్సన్ (17) అవుటయ్యారు. అయితే, క్రీజులో ఉన్న రాహుల్ త్రిపాఠి, మార్కరమ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇద్దరూ పోటాపోటీగా ఆడారు. బంతిని నిర్దాక్షిణ్యంగా బాది స్టాండ్స్‌లోకి తరలించారు. 

ఫలితంగా హైదరాబాద్ గెలుపు నల్లేరు మీద నడకే అయింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రాహుల్ త్రిపాఠి 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 71 పరుగులు చేసి అవుట్ కాగా, మార్కరమ్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా హైదరాబాద్ 17.5 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేసి నిరాశపరచగా నితీశ్ రాణా (54) అర్ధ సెంచరీతో రాణించాడు. చివర్లో ఆండ్రూ రసెల్ చెలరేగాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేసి జట్టు 175 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 

ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ముంబైలో మధ్యాహ్నం 3.30 గంటలకు తొలి మ్యాచ్ జరగనుండగా, ఢిల్లీ కేపిటల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య వాంఖడేలో 7.30 గంటలకు రెండో మ్యాచ్ జరగనుంది.

More Telugu News