Nadendla Manohar: 'అమ్మ ఒడి'కి మంగళం పాడుతున్నారు... అందుకే ఈ ఆంక్షలు: నాదెండ్ల మనోహర్

  • అమ్మ ఒడి లబ్దిదారులకు కొత్త ఆంక్షలంటూ ప్రచారం
  • నాదెండ్ల ఫైర్ 
  • నవరత్నాల్లో ఒక్కో రత్నం రాలిపోతోందని వ్యాఖ్య 
  • ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమ్మ ఒడి ద్వారా లబ్దిదారులకు ఒక్క పైసా రాలేదని విమర్శ 
Nadendla Manohar slams YCP Govt on Amma Odi scheme

అమ్మఒడి పథకం లబ్దిదారులకు కొత్త ఆంక్షలు తీసుకువస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శనాస్త్రాలు సంధించారు. అమ్మ ఒడికి మంగళం పాడేందుకే ఈ ఆంక్షలు అని ఆరోపించారు. వైసీపీ సర్కారు తన పథకాలను తానే కాలగర్భంలో కలిపేసుకునేందుకు సిద్ధమైందని విమర్శించారు. అందులో భాగంగానే అమ్మ ఒడి పథకాన్ని క్రమంగా పక్కన పెట్టేసేందుకు ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. 

ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమ్మ ఒడి ద్వారా లబ్దిదారులకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాబోయే విద్యాసంవత్సరంలోనూ అమ్మ ఒడి డబ్బులు ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలా అని జగన్ సర్కారు ఇప్పటినుంచే ఆలోచనలు మొదలుపెట్టిందని పేర్కొన్నారు.

విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటితే అమ్మ ఒడి తొలగిస్తామని ప్రకటించారని, వేసవిలో విద్యుత్ వాడకం కచ్చితంగా పెరుగుతుందని వివరించారు. ఇప్పటి వాడకం ప్రకారం చూస్తే కచ్చితంగా ఎక్కువ యూనిట్లు ఉంటాయని, కావాలనే ఈ సమయాన్ని ఎంచుకున్నారని నాదెండ్ల వెల్లడించారు. తద్వారా పేద తల్లులను ఈ పథకానికి అనర్హులను చేసేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పేదలు చాలా వరకు చిన్న ఇళ్లలో నివాసం ఉంటారని, వాళ్లకు నాలుగైదు వాటాలకు కలిపి ఒక మీటర్ ఉంటుందని, అలాంటప్పుడు కచ్చితంగా విద్యుత్ వాడకం అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని నాదెండ్ల తెలిపారు. 

దాంతోపాటు, ఆధార్ కార్డుల్లో జిల్లా పేరు మార్చుకోవాలనడంపైనా ఆయన స్పందించారు. ఈ నిబంధన మండుటెండల్లో ప్రజలను ఆధార్ కేంద్రాల ముందు నిలబెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాయకష్టం చేసుకుని బతికేవాళ్లు ఆధార్ కార్డుల్లో మార్పుల కోసం కచ్చితంగా రెండుమూడు రోజులు పనులకు దూరం కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏదో విధంగా తల్లులను అమ్మ ఒడికి దూరం చేయడమే సర్కారు ఉద్దేశంగా కనిపిస్తోందని ఆరోపించారు. 

ఈ పథకం తొలి నుంచి కూడా ప్రభుత్వం మాట మారుస్తూనే ఉందని తెలిపారు. పేద తల్లులు తమ బిడ్డలను చదివించేందుకు డబ్బులు ఇస్తానని ప్రచారంలో చెప్పారని, కానీ అమలు విషయానికొచ్చేసరికి ఒక బిడ్డకు ఇస్తామంటూ జగన్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. 

2021-22 విద్యాసంవత్సరానికి అమ్మ ఒడి డబ్బులు ఇవ్వలేదని, ఇప్పుడు 2022-23 విద్యాసంవత్సరానికి కూడా అమ్మ ఒడికి విద్యార్థులను దూరం చేసే పనిలో ఉన్నారని, తద్వారా క్రమంగా ఈ పథకానికి మంగళం పాడనున్నారని నాదెండ్ల విమర్శించారు. ప్రణాళిక లేని వైసీపీ ప్రభుత్వం మొదులపెట్టిన నవరత్నాల్లో ఒక్కో రత్నం రాలిపోతోందని ప్రజలు గ్రహిస్తున్నారని నాదెండ్ల అన్నారు.

More Telugu News