YSRCP: పోల‌వ‌రాన్ని మోదీ ఏటీఎం అని ఎందుక‌న్నారో చెప్పిన అంబ‌టి రాంబాబు

  • స్పిల్ వేకు బ‌దులుగా కాఫ‌ర్ డ్యాం కట్టారన్న అంబటి 
  • చంద్ర‌బాబు నిర్వాకం వ‌ల్లే డ‌యాఫ్రం వాల్‌ వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయిందని విమర్శ 
  • పోల‌వ‌రాన్ని తామే నిర్మించి తీర‌తామ‌న్న మంత్రి 
ambati rambabu comments on polavaram project

ఏపీకి జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టును టీడీపీ స‌ర్కారు ఏటీఎంగా మార్చుకుంద‌ని 2019 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. నాడు పోల‌వ‌రం ప్రాజెక్టుపై ప్ర‌ధాని ఆ వ్యాఖ్య‌లు ఎందుకు చేశార‌న్న విష‌యంపై ఇప్పుడు ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా కొత్త‌గా బాధ్య‌త‌లు తీసుకుంటున్న అంబ‌టి రాంబాబు క్లారిటీ ఇచ్చారు. 

పోల‌వ‌రం ప్రాజెక్టులో భాగంగా స్పిల్ వేను క‌ట్ట‌కుండా చంద్ర‌బాబు కాఫ‌ర్ డ్యాంను క‌ట్టి డ‌బ్బులు కొట్టేశార‌ని, అందుకే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పోల‌ర‌వం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుంద‌ని మోదీ అన్నార‌ని రాంబాబు చెప్పుకొచ్చారు. ఈ మేర‌కు ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి హోదాలో శుక్ర‌వారం నాడు మీడియాతో మాట్లాడిన అంబ‌టి.. చాలా విష‌యాలే ప్ర‌స్తావించారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ... "పోల‌వ‌రంపై దుష్ప్ర‌చారం జ‌రుగుతోంది. పోల‌వ‌రాన్ని మేమే నిర్మించి తీర‌తాం. స‌మ‌స్య‌ను అధిగ‌మించి ప్రాజెక్టు నిర్మాణంలో ముందుకు సాగుతున్నాం. చంద్ర‌బాబు స్పిల్ వే క‌ట్ట‌కుండా కాఫ‌ర్ డ్యాం క‌ట్టి డ‌బ్బులు కొట్టేశారు. అందుకే ప్ర‌ధాని మోదీ పోల‌వ‌రాన్ని ఏటీఎంగా మార్చార‌ని అన్నారు.. చంద్ర‌బాబు నిర్వాకం వ‌ల్ల వ‌ర‌ద‌ల‌కు డ‌యాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు వాటిని మ‌ళ్లీ క‌ట్టాల్సి వ‌స్తోంది" అని మంత్రి రాంబాబు వ్యాఖ్యానించారు.

More Telugu News