Imran Khan: పదవిలో ఉన్నప్పుడు కాదు.. ఇప్పుడే నేను మరింత ప్రమాదకారిని: ఇమ్రాన్ ఖాన్

  • పెషావర్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్ 
  • తనను ప్రధానిగా తప్పించడంలో అక్రమాలు జరిగాయని ఆరోపణ 
  • అర్ధరాత్రి వేళ కోర్టులను ఎందుకు తెరిచారని ప్రశ్న 
  • న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదని వ్యాఖ్య 
  • దిగుమతి ప్రభుత్వాన్ని ఆమోదించమన్న ఇమ్రాన్ 
I wasnt dangerous when in power will be dangerous now says ex Pakistan PM Imran Khan

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత మొదటిసారి ఆవేశపూరిత ప్రసంగం చేశారు. పెషావర్ లో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వంలో భాగంగా ఉన్న సమయంలో నేను ప్రమాదకారి కాదు. కానీ, నేను ఇప్పుడు మరింత ప్రమాదకారిని’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని పదవి నుంచి తనను తప్పించే విషయంలో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. తనను తప్పించేందుకు అర్ధరాత్రి వేళ కోర్టులను ఎందుకు తెరవాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

ఇమ్రాన్ ఖాన్ సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు గడువు విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణకు ఏప్రిల్ 9న అర్ధరాత్రి సుప్రీంకోర్టు కొలువు దీరడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశించినా, నాటి స్పీకర్ అర్ధరాత్రి సమయంలో అవిశ్వాసంపై ఓటింగ్ చేపట్టలేదు. ఇదే అంశానికి సంబంధించి మరో పిటిషన్ పై ఇస్లామాబాద్ హైకోర్టు కూడా అర్ధరాత్రి విచారణ చేపట్టడం గమనార్హం.

‘‘కోర్టులను రాత్రివేళ ఎందుకు తెరిచారు? నేను ఏమైనా చట్టాలను ఉల్లంఘించానా? న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదు. నా మొత్తం రాజకీయ కెరీర్ లో వ్యవస్థలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రజలను ప్రేరేపించలేదు’’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఏమైనా నూతన దిగుమతి ప్రభుత్వాన్ని తాము ఆమోదించేది లేదన్నారు. ప్రజలు కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రదర్శనలను దీనికి నిదర్శనంగా ప్రస్తావించారు. తన ప్రభుత్వాన్ని కూల్చడంలో విదేశాల హస్తం ఉందని మరోసారి ఇమ్రాన్ ఆరోపించారు.

More Telugu News