Mumbai Indians: అయ్యో! ముంబై.. ఐదో మ్యాచ్‌లోనూ ఓటమి

  • ఓటముల నుంచి బయటపడలేకపోతున్న ముంబై
  • బ్రెవిస్, సూర్యకుమార్ మెరుపులు వృథా
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా మయాంక్
  • పాయింట్ల పట్టికలో కింది నుంచి తొలి స్థానంలో ముంబై
Mumbai defeated in consecutive 5th match

పాపం ముంబై.. ఈసారి ఐపీఎల్‌లో ఆ జట్టుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. గత రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 186 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయి మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లోనూ ఓడింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో కింది నుంచి తొలి స్థానంలో ఉంది.

మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ తొలుత అర్ధ సెంచరీలతో రాణించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. 199 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై లక్ష్యం దిశగానే ముందుకు సాగింది. 11 ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసి జోరు మీద ఉన్నట్టు కనిపించింది. 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 పరుగులు చేసిన బ్రెవిస్, 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసిన తిలక్ వర్మ అవుటయ్యాక ముంబై ఆశలు సన్నగిల్లాయి. 

అయితే, సూర్యకుమార్ యాదవ్ మరోమారు విజృంభించడంతో ఆశలు తిరిగి చిగురించాయి. సూర్య 30 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని దగ్గర చేశాడు. అయితే, అతడికి అండగా ఉన్న కీరన్ పొలార్డ్ (10) అవుట్ కావడం, ఆ తర్వాత సూర్య కూడా పెవిలియన్ చేరడంతో ముంబై ఆశలు అడియాసలయ్యాయి. 

దీనికి తోడు చివరి ఓవర్‌లో ఓడియన్ స్మిత్ విజృంభించి జయదేవ్ ఉనద్కత్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్‌ను డకౌట్లుగా వెనక్కి పంపడంతో ముంబై ఓటమిని తప్పించుకోలేకపోయింది. 9 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేసి ఐదో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. పంజాబ్ బౌలర్లలో ఓడియన్ స్మిత్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్-ధవన్ జోడి తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించింది. కెప్టెన్ అగర్వాల్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52, ధావన్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేశారు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేయడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించగలిగింది. బెయిర్‌స్టో 12, షారూఖ్ ఖాన్ 15 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బాసిల్ థంపికి రెండు వికెట్లు దక్కాయి. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

More Telugu News