TTD: తోపులాట నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం.. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకే తొలుత దర్శనం

  • సర్వదర్శనం టోకెన్ల కోసం ఎగబడడంతో తొక్కిసలాట
  • మంగళవారం వరకు టోకెన్లు తీసుకున్న వారికి తొలుత అనుమతి
  • 25 వేల మంది వస్తే అదే రోజు దర్శనం చేయిస్తామన్న ఈవో
TTD Taken key decision to avoid devotees Congestion

తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు ఎగబడడంతో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం కౌంటర్ల ద్వారా మంగళవారం వరకు టోకెన్లు తీసుకున్న భక్తులకే తొలుత స్వామి వారి దర్శనం కల్పించనున్నట్టు ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్‌బాబు తెలిపారు. టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలకు చేరుకుని సర్వదర్శనం లైన్‌లో వచ్చే భక్తులను తర్వాత అనుమతిస్తామన్నారు. 

వీరికి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ముందున్న కంప్యూటర్ స్కానింగ్ కేంద్రంలో అప్పటికప్పుడు కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లను ఏర్పాటు చేసి ప్రతి భక్తుడు ఒక లడ్డూ పొందేలా టోకెన్లు ఇచ్చారు. ఒక రోజులో 25 వేల మంది లోపు భక్తులు వస్తే అదే రోజు దర్శనం చేయిస్తామని, ఈ సంఖ్య 60 వేలు దాటితే సుదీర్ఘ సమయం పడుతుందన్నారు. దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అప్పటి వరకు వేచి చూసే భక్తులకు నీరు, అన్న ప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఈవో తెలిపారు.

More Telugu News