Jitendra New EV Tech: ఎలక్ట్రిక్ వాహనాలు తరలిస్తున్న కంటెయినర్‌లో మంటలు.. 20 స్కూటర్ల ఆహుతి

  • మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘటన
  • బెంగళూరుకు ఎలక్ట్రిక్ స్కూటర్లను తరలిస్తుండగా ప్రమాదం
  • మూడు వారాల్లో ఐదో ఘటన
  • దర్యాప్తు చేపట్టామన్న జితేంద్ర న్యూ ఈవీ టెక్ కంపెనీ
Jitendra New EV Tech Investigating Incident Of Its Electric Scooters Catching Fire

ఎలక్ట్రిక్ వాహనాలను తరలిస్తున్న కంటెయినర్‌లో మంటలు చెలరేగడంతో 20 స్కూటర్లు దగ్ధమయ్యాయి. మహారాష్ట్రలోని నాసిక్‌లో జితేంద్ర న్యూ ఈవీ టెక్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తుంటుంది. 40 స్కూటర్లను ఓ కంటెయినర్‌లో బెంగళూరుకు తరలిస్తుండగా ఫ్యాక్టరీ గేటు సమీపంలోనే కంటెయినర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 20 స్కూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. 

ఇటీవల వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గత మూడు వారాల్లో ఇలాంటివి ఐదు ఘటనలు జరగడం గమనార్హం. మార్చి 26న పూణెలో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కాలి బూడిదైంది. అదే రోజున తమిళనాడులోని వెల్లూరులో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్నాయి. గత నెల 28న తిరుచ్చిలోనూ ఇలాంటి ఘటనే జరగ్గా, ఆ తర్వాతి రోజే చెన్నైలోనూ ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ మంటలకు ఆహుతైంది. తాజా ఘటన ఐదోది. 

తాజా ఘటనపై విచారణ చేపట్టినట్టు జితేంద్ర న్యూ ఈవీ టెక్ కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే బ్యాటరీల్లో నాణ్యత లేకపోవడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కాగా, వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై కేంద్రం కూడా దృష్టి సారించింది. కారణమేంటో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించింది.

More Telugu News