Balineni Srinivasa Reddy: సురేశ్ కు మంత్రిపదవి ఇస్తే నేను అలిగానని రాశారు... పరువునష్టం దావా వేస్తా: బాలినేని

  • మంత్రి పదవిని కోల్పోయిన బాలినేని
  • మంత్రి పదవిని నిలుపుకున్న ఆదిమూలపు
  • మీడియాలో అసత్య కథనాలు వచ్చాయన్న బాలినేని
  • మీడియా వార్తలను ఖండిస్తున్నట్టు ప్రకటన
Balineni Vasu warns media

మంత్రి పదవిని కోల్పోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాపై మండిపడ్డారు. తొలుత మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ తాను అన్నట్టుగా కొన్ని కథనాలు వచ్చాయని, ఆ తర్వాత ఆదిమూలపు సురేశ్ కు మంత్రి పదవి ఇవ్వడంతో తాను అలకబూనినట్టు రాశారని బాలినేని ఆరోపించారు. ఇవన్నీ నిరాధార వార్తలని, వీటిని తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటివి రాసినవారిపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. 

మంత్రి పదవి కోసం తానెప్పుడూ పాకులాడలేదని, అయితే పదవి లేకపోతే కొద్దిగా బాధపడ్డానని అంగీకరించారు. సీఎం జగన్ ఒక్క మాట చెప్పగానే 24 మంది మంత్రులం రాజీనామా చేశామని, ఇప్పుడు కూడా సీఎం ఏం చెబితే అది చేస్తానని బాలినేని స్పష్టం చేశారు. 

పార్టీ ఒక కుటుంబం వంటిదని, కొత్త క్యాబినెట్ లో అందరూ సమర్థులేనని అభిప్రాయపడ్డారు. ఆదిమూలపు సురేశ్, తాను గత క్యాబినెట్ లో పనిచేశామని, సురేశ్ అనవసరంగా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న సందర్భాలే లేవని అన్నారు. పార్టీకి ఏది మేలు చేస్తుందో ఇకపైనా తాము అదే చేస్తామని ఉద్ఘాటించారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో కొందరు రాజీనామాలు చేశారని, వాటిని వెనక్కి తీసుకోవాలని చెబుతానని బాలినేని వివరించారు. తాను వైఎస్సార్ కుటుంబ సభ్యుడ్నని, అందరం కలిసి మెలిసి ఉండాలనే కోరుకుంటానని పేర్కొన్నారు. 

కాగా, ఈ నెల 23న సీఎం జగన్ ఒంగోలు వస్తున్నారని, సజ్జల రామకృష్ణారెడ్డితో ఆ విషయం మాట్లాడానని తెలిపారు. మంత్రిపదవి దక్కకపోవడంతో బాలినేని అలకబూనారని, బాలినేనిని బుజ్జగించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల పలుమార్లు ఆయన నివాసానికి వెళ్లారని కథనాలు రావడం తెలిసిందే.

More Telugu News