AR Rahman: భారత్ అంతా ఒకటే... ఉత్తర, దక్షిణ అని వేర్వేరుగా ఉండదు: ఏఆర్ రెహమాన్

  • ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయం హిందీనే అన్న అమిత్ షా
  • సర్వత్రా విమర్శలు వస్తున్న వైనం
  • తమిళం దేశానికి అనుబంధ భాష అంటూ రెహమాన్ వ్యాఖ్యలు
  • అందరూ ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని స్పష్టీకరణ
AR Rahman comments on India unity

భారత్ లో ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీ మాట్లాడాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించడం పట్ల విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అవకాశం చిక్కినప్పుడుల్లా అమిత్ షా వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ అంతా ఒకటేనని, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని వేర్వేరుగా చూడరాదని స్పష్టం చేశారు.

"గతంలో ఓసారి నేను మలేషియా వెళ్లాను. అక్కడ ఓ చైనా జాతీయుడు ఉత్తర భారతదేశం అంటే తనకెంతో ఇష్టమని, వారి సినిమాలు ఎక్కువగా చూస్తానని చెప్పాడు. దాంతో ఆ చైనా జాతీయుడు అసలెప్పుడైనా దక్షిణాది సినిమాలు చూశారా..? అనే సందేహం కలిగింది. ఉత్తరాది మాత్రమే భారతదేశం అనే భావన పోవాలి. 

భారత్ లో ఉత్తరాది చిత్రాలే కాదు, తమిళ చిత్రాలు ఉన్నాయి, అలాగే మలయాళం, ఇతర భాషల చిత్రాలు కూడా ఉన్నాయి. ఉత్తరాదిన మనవాళ్లు రాణిస్తున్నారు... దక్షిణాదిన ఉత్తరాది వాళ్లు రాణిస్తున్నారు. ఉత్తరాది, దక్షిణాది అనే అడ్డుగోడలు లేవు. 

కళ, చిత్రాల ద్వారా ప్రజలను విడగొట్టడం ఎంతో సులువైపోయింది. కానీ ఇప్పుడు అందరూ ఏకమవ్వాల్సిన సమయం వచ్చింది. అప్పుడు ఓ దేశంతో ఎంతో శక్తిమంతం అవుతాం... తద్వారా ప్రపంచాన్ని శాసించగలం" అని పేర్కొన్నారు. 

సీఐఐ నిర్వహించిన సౌతిండియా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ సదస్సులో రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అమిత్ షా హిందీ వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని, "తమిళం ఈ దేశానికి అనుబంధ భాష" అని స్పష్టం చేశారు.

More Telugu News