Kotamreddy Sridhar Reddy: మంత్రి పదవి రాలేదని విలపించిన కోటంరెడ్డి... వీడియో ఇదిగో!

  • ఏపీలో కొత్త మంత్రివర్గం ఖరారు
  • 25 మందితో జాబితా
  • పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు తీవ్ర నిరాశ
  • కంటతడి పెట్టుకున్న కోటంరెడ్డి
Kotamreddy cries after he gets no place in new cabinet

కచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని ఆశించిన వారిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. కానీ, ఇవాళ ఖరారైన ఏపీ నూతన క్యాబినెట్ జాబితాలో కోటంరెడ్డి పేరు లేదు. దాంతో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. తనకు మంత్రి పదవి దక్కలేదని, వైసీపీ నేతలు, కార్పొరేటర్లు ఎవరూ రాజీనామాలు చేయొద్దని సూచించారు. వైసీపీ కార్యకర్తలు, నేతలు తమ రక్తాన్నే చెమటగా మార్చి తనను రెండుసార్లు గెలిపించారని, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నానని కోటంరెడ్డి వివరించారు. మంత్రి పదవి రాలేదన్న బాధ ఉందంటూ భావోద్వేగాలు వ్యక్తం చేశారు. 

కాగా, మంత్రిపదవి వస్తుందని ఆశించి, నిరాశకు గురైన వైసీపీ ఎమ్మెల్యేల అనుచరులు పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను మద్దతుదారులు జాతీయ రహదారిపై టైర్లు దగ్ధం చేశారు. అంతేకాదు, ఓ ద్విచక్రవాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు మంటలు అంటుకోగా, కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 

అటు, పల్నాడులోనూ నిరసనజ్వాలలు భగ్గుమన్నాయి. నాలుగు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరగణం ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. పదవులకు రాజీనామా చేస్తామంటూ మాచర్ల మున్సిపల్ చైర్మన్ కిశోర్ తో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారు. 

ఏపీ కొత్త క్యాబినెట్ జాబితాలో తన పేరు లేదని తెలుసుకున్న పిన్నెల్లి తన నివాసానికే పరిమితమయ్యారు. ఎవరినీ కలవడానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఇక, విజయవాడలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మద్దతుదారులు నిరసనకు దిగారు. అయితే, పార్టీ కోసం పనిచేద్దామంటూ పార్థసారథి వారికి నచ్చచెప్పారు.

More Telugu News