Sajjala Ramakrishna Reddy: ఇది జగన్ రికార్డు... గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు: సజ్జల

  • ఏపీలో కొత్త క్యాబినెట్ 
  • జాబితాకు ఓకే చెప్పిన సీఎం జగన్
  • ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం
  • బలహీనవర్గాలకు పెద్దపీట వేశామన్న సజ్జల
  • ఎన్నికల కోసం కాదని స్పష్టీకరణ
Sajjala press meet on new cabinet

నూతన మంత్రివర్గం ఇదేనంటూ ఓ జాబితా వెల్లడైన అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ మొదటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేస్తోందని వెల్లడించారు. 

2014లో గెలిచాక తొలి క్యాబినెట్ లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటిచ్చారని వివరించారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు... బ్యాక్ బోన్ అని సీఎం జగన్ నిరూపించారని తెలిపారు. ఈసారి 25 మందిలో 68 శాతం మంది బడుగు బలహీన వర్గాలకు చెందినవారేనని అన్నారు. దేశంలో ఎప్పుడూ, ఎక్కడా  ఇలా జరగలేదని స్పష్టం చేశారు. ఇంతమంది బడుగు, బలహీన వర్గాలకు అవకాశమిచ్చిన ఘనత జగన్ కే సొంతమని ఉద్ఘాటించారు. సీఎం జగన్ నిర్ణయాన్ని సామాజిక మహా విప్లవంగా పేర్కొన్నారు. 

గతంలో చంద్రబాబు కూడా తాను బీసీల ఆత్మబంధువునని చెప్పుకున్నారని, కానీ ఆయన నిజస్వరూపం గ్రహించాక బీసీలు ఆయనకు దూరం జరగడం ప్రారంభించారని సజ్జల పేర్కొన్నారు. అయితే దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీలకు పెద్ద పీట వేస్తోంది వైసీపీ సర్కారు అని వెల్లడించారు. 

ఈ విషయాన్ని తాము ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే, చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే సమయంలో ఉన్న టీడీపీ క్యాబినెట్ చూస్తే 48 శాతం మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాతినిధ్యం ఉంటే, 52 శాతం ఓసీలు ఉన్నారని సజ్జల వివరించారు. అదే వైసీపీ క్యాబినెట్ చూస్తే 68 శాతం బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉంటే, 32 శాతం మాత్రమే ఓసీలు ఉన్నారని తెలిపారు. సామాజిక న్యాయం నినాదంతో సరిపెట్టకుండా, ఆ నినాదాన్ని నిజం చేశామని ఉద్ఘాటించారు. 

ఇక తాజా క్యాబినెట్ గురించి మాట్లాడుతూ, అన్ని అంశాలు పరిశీలించాకే తుది జాబితా ఖరారు చేశామని సజ్జల స్పష్టం చేశారు. పదవులు వస్తేనే ప్రాధాన్యత ఇచ్చినట్టు కాదని అన్నారు. ఇది వైసీపీ విధానం కాబట్టి, ఈ నిర్ణయాన్ని ఎవరూ తీవ్రంగా తీసుకోరని వివరించారు. ఇది ఎన్నికల కోసం చేసిన క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ కాదని పేర్కొన్నారు.

More Telugu News