Imran Khan: ఇమ్రాన్‌కు షాక్.. అవిశ్వాస తీర్మానంలో ఓటమి.. పాక్ కొత్త ప్రధానిగా నవాజ్ షరీఫ్ సోదరుడు!

  • అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఇమ్రాన్
  • ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా 174 మంది సభ్యుల ఓటు
  • అధికారిక నివాసాన్ని ముందే ఖాళీ చేసి వెళ్లిపోయిన ఇమ్రాన్
  • స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రాజీనామా
  • అవిశ్వాస తీర్మానంలో పదవి కోల్పోయిన తొలి పాక్ ప్రధానిగా ఇమ్రాన్
Imran Khan Dismissed As Pak PM After Losing No Trust Vote

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్ తగిలింది. అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. 342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో 174 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటువేశారు. ఫలితంగా ఇమ్రాన్ ప్రధాని పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని పదవి కోల్పోయిన తొలి పాక్ ప్రధానిగా ఇమ్రాన్ చరిత్రకెక్కారు. ఇమ్రాన్ ఖాన్ స్థానంలో ఇప్పుడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు, పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశం ఉంది.

మరోవైపు, అవిశ్వాస తీర్మానంలో ఓటమి ఖాయమని ముందే నిర్ణయానికి వచ్చిన ఇమ్రాన్ సభలో తీర్మానం జరుగుతుండగానే అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.  నిజానికి పాక్‌లో నిన్నంతా హైడ్రామా నడిచింది. అవిశ్వాస తీర్మానం పలుమార్లు వాయిదా పడుతూ అర్ధరాత్రి వరకు కొనసాగింది. అజెండాలో ఓటింగ్ నాలుగో అంశం కావడంతో సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గంటల తరబడి సుదీర్ఘంగా ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినా తొలుత ‘విదేశీ కుట్ర’పై చర్చ జరుపుదామంటూ స్పీకర్ అసద్ ఖైసర్ సాయంతో అధికారపక్షం పట్టుబట్టింది. 

ఉదయం నుంచి ఓటింగును వ్యూహాత్మకంగా వాయిదా వేస్తూ వచ్చిన ఇమ్రాన్ రాత్రి తన నివాసంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ చీఫ్ ఆయనను కలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఇమ్రాన్ ఆర్మీ నాయకత్వంలో మార్పులపై వస్తున్న వార్తలను ఖండించారు. అలాగే, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా, పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైసర్, డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తమ పదవులకు రాజీనామా చేశారు. రాత్రి సభ మళ్లీ ప్రారంభం కాగానే తమ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

More Telugu News