Mumbai Indians: బెంగళూరు ఖాతాలో వరుసగా మూడో విజయం.. ముంబై నాలుగో‘సారీ’

  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమైన ముంబై
  • వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓటమి
  • రాణించిన అనూజ్ రావత్, కోహ్లీ
Bowlers and Rawat star in RCBs clinical win

తొలుత బౌలర్లు విజృంభించి వికెట్లు తీయడం, ఆపై అనూజ్ రావత్, కోహ్లీ రాణించడంతో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. డుప్లెసిస్ సేనకు ఇది వరుసగా మూడో విజయం కాగా, ముంబై వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడింది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 152 పరుగుల విజయ లక్ష్యాన్ని బెంగళూరు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలోనే ఛేదించింది. 

అనూజ్ రావత్ 47 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 5 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. ఫలితంగా మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 6 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై బ్యాటింగ్‌లో మరోమారు తడబడింది. 62 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. 79 పరుగుల వద్ద మరో వికెట్ కోల్పోయింది. దీంతో ఆ జట్టు 100 పరుగులు కూడా చేయడం కష్టమేనని భావించారు. అయితే, సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారిగా చెలరేగడంతో స్కోరు పరుగులు పెట్టింది. 37 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 68 పరుగులు చేశాడు. ఫలితంగా 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో హసరంగ, హర్షల్ పటేల్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన అనూజ్ రావత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

More Telugu News