USA: పాకిస్థాన్ నిఘా సంస్థ కుట్రను భగ్నం చేసిన అమెరికా

  • అమెరికా నిఘా వ్యవస్థల్లోకి చొరబడే యత్నం
  • అమెరికా సిబ్బందికి ఖరీదైన కానుకలు
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎఫ్ బీఐ
  • పాకిస్థాన్, ఇరాన్ వీసాలు స్వాధీనం
  • వారిద్దరూ ఐఎస్ఐ ఆదేశాలతో పనిచేస్తున్నట్టు వెల్లడి
USA busted conspiracy against homeland security

ఇప్పటికే తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ తాజాగా మరింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కుట్రను అమెరికా భగ్నం చేసింది. దేశాధ్యక్షుడు జో బైడెన్ భద్రతను పర్యవేక్షించే సీక్రెట్ సర్వీస్, అమెరికా నిఘా, భద్రతా విభాగాల్లోకి చొరబడేందుకు ఐఎస్ఐ చేసిన ప్రయత్నాలను వమ్ము చేసింది. ఈ మేరకు అరియన్ తాహిర్ జాదే, హైదర్ అలీ అనే వ్యక్తులను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) అధికారులు అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఐఎస్ఐ ఆదేశాలతో పనిచేస్తున్నట్టు గుర్తించారు. 

అమెరికా అధ్యక్షుడి సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని వారు ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించినట్టు వెల్లడైంది. అమెరికా నిఘా, భద్రతా విభాగాల్లో పనిచేసే వారి నివాసాల వద్ద నిఘా వేయడం, వారికి ఖరీదైన కానుకలు ఇచ్చి వారిని తమ బుట్టలో వేసుకునేందుకు వీరు యత్నించినట్టు అమెరికా అధికారుల విచారణలో తేలింది. అరెస్టయిన ఆ ఇద్దరిలో ఒకరి వద్ద ఉన్న పాకిస్థాన్, ఇరాన్ వీసాలను స్వాధీనం చేసుకున్నారు. 

తాహిర్ జాదే, హైదర్ అలీ గత కొన్ని నెలలుగా అమెరికాలో నకిలీ సర్టిఫికెట్లతో ఫెడరల్ ఏజెంట్లుగా చలామణీ అయినట్టు ఎఫ్ బీఐ గుర్తించింది. వీరిద్దరితో సన్నిహితంగా మెలిగిన అమెరికా సిబ్బందిని సెలవుపై పంపారు.

More Telugu News