Cricket: మూడు ఓటముల తర్వాత.. భయపడొద్దంటూ జట్టుకు రోహిత్ స్ఫూర్తి పాఠాలు

  • గెలిచినా ఓడినా జట్టుగానే స్వీకరించాలన్న రోహిత్ 
  • మనకిప్పుడు కావాల్సింది పట్టుదల, తపన అని వ్యాఖ్య 
  • ప్రత్యర్థుల నుంచి మనమూ విజయాన్ని లాగేసుకోవాలన్న కెప్టెన్ 
  • విపత్తు నుంచి మరింత ఎత్తుకు ఎదగాలని సూచన
Rohit Motivational Speech In dressing Room After 3 Consecutive Loses

హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు కాస్తంత డీలా పడినట్టు కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో అడుగు నుంచి రెండో స్థానంలో ఉన్న ఆ జట్టు నెట్ రన్ రేట్ మైనస్ 1.362గా ఉంది. జట్టుకు విజయం అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ పలు సూచనలు చేశాడు. స్ఫూర్తి వాక్యాలు నూరిపోశాడు. 

భయపడ వద్దని, గెలుపు కోసం తపించాలని సూచించాడు. ఆటలో మరింత చురుకుగా కదలాల్సిన అవసరం ఉందని చెప్పాడు. జరిగిన విపత్తు నుంచి తేరుకుని మరింత ఎత్తుకు చేరుకునేందుకు కృషి చేయాలన్నాడు. 

‘‘ఎవరో ఒకరిపైనే మనం తప్పును నెట్టివేయకూడదు. గెలిచినా.. ఓడినా అంతా కలసికట్టుగా స్వీకరించాల్సిందే. నేను చెప్పేది ఆ ఒక్కటే. మనకు ఇప్పుడు కావాల్సింది పట్టుదల. ఆడేటప్పుడు ఆ పట్టుదలను చూపించాలి. ప్రత్యేకించి ఇలాంటి టోర్నమెంట్లు ఆడేటప్పుడు మరింత శ్రద్ధ పెట్టాలి’’ అని సహచరులకు సూచించాడు. 

ప్రతిసారీ వేర్వేరు ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒక్కో జట్టు ఒక్కో వ్యూహంతో బరిలోకి దిగుతుంటాయని అన్నాడు. వారిని ఎదుర్కోవాలంటే వారి ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సి ఉంటుందని చెప్పాడు. మైదానంలోకి దిగినప్పుడు గెలవాలనే తపన, పట్టుదల ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని, బ్యాటింగ్, బౌలింగ్ లో దానిని మనం నిరూపించుకోవాల్సి ఉందని స్పష్టం చేశాడు. 

ఎవరూ దేనికీ భయపడాల్సిన అవసరం లేదన్నాడు. జట్టులో ప్రతిభకు కొదవలేదని చెప్పాడు. ప్రత్యర్థులు మన దగ్గర్నుంచి విజయాన్ని లాగేసుకున్నట్టే.. మనమూ వాళ్ల దగ్గర్నుంచి లాగేసుకోవాలని స్ఫూర్తి పాఠం చెప్పాడు. కాగా, రేపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పూణెలోని ఎంసీఏ స్టేడియంలో ముంబై తలపడనుంది.

More Telugu News