RBI: వడ్డీ రేట్లు మార్చని ఫలితం.. ఎఫ్ డీలకు నష్టమే.. హోం లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ పై ప్రభావం ఎలా ఉంటుందంటే...!

  • షార్ట్ టర్మ్ డిపాజిట్ రేట్లు పెరిగే అవకాశం
  • దీర్ఘకాలిక డిపాజిట్లపై మారని రేట్లు
  • గృహ రుణాలు తీసుకున్నవాళ్లు ఓసారి రివ్యూ చేసుకుంటే మేలు
How RBI Decision Effects Your Loans and FDs

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కీలకమైన వడ్డీ (రెపో, రివర్స్ రెపో) రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెంచుతుందని అంతా భావించారు. కానీ, ఆర్బీఐ మాత్రం ఇటు పెంచడంగానీ, తగ్గించడంగానీ చేయలేదు. పాత రేట్లనే యథాతథంగా ఉంచేసింది. దాని వల్ల రుణాలు తీసుకునేవారిపై పెద్దగా ప్రభావమేమీ పడకపోయినా.. ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు మాత్రం మింగుడుపడని విషయమే. రెపోరేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్దే ఆర్బీఐ స్థిరంగా ఉంచింది. 

షార్ట్ టర్మ్ డిపాజిట్ రేట్లు పెరుగుతాయ్


ఆర్బీఐ నిర్ణయంతో తొలుత షార్ట్ టర్మ్ డిపాజిట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి వడ్డీ రేట్ సైకిల్ లో కిందకు వెళ్లి మళ్లీ పైకి వచ్చే క్రమంలో షార్ట్ టర్మ్ నుంచి మిడ్ టర్మ్ డిపాజిట్ రేట్లే తొలుత పెరుగుతుంటాయి. అయితే, దీర్ఘకాలిక డిపాజిట్ రేట్లు పెరగడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. 

తక్కువ రేటుకు ఎక్కువ కాలం డిపాజిట్ చేయొద్దు

తక్కువ వడ్డీ రేటున్నప్పుడు దీర్ఘకాలిక డిపాజిట్లు చేయకూడదు. ఇప్పటికిప్పుడు ఎఫ్ డీలను ఓపెన్ చేయాలనుకున్నా.. లేదా ఇప్పటికే ఉన్న ఎఫ్ డీలను మార్చుకోవాలనుకున్నా షార్ట్ టర్మ్ ఎఫ్ డీలనే ఎంచుకుంటే మంచిది. ఏడాది లేదా ఆలోపు వరకే డిపాజిట్ చేస్తే ఎక్కువ కాలం పాటు డిపాజిట్ డబ్బులు లాకర్లలో లాక్ అయిపోవు. రేట్లు పెరిగినప్పుడల్లా షార్ట్ టర్మ్ డిపాజిట్ కాలపరిమితిని పెంచుకునేందుకు వీలుంటుంది. 

లోన్లు తీసుకునేవాళ్ల పరిస్థితేంటి?

బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు కాబట్టి.. రుణాలు తీసుకోవాలనుకునేవారిపై పెద్దగా ప్రభావం ఉండే అవకాశం లేదు. అయితే, తక్కువ వడ్డీ రేటు ఇలాగే ఎక్కువ కాలం ఉంటుందనీ అనుకోలేం. ప్రస్తుతానికైతే రుణాలు తీసుకునేవారికి కొంత మేర లాభమే. 

గృహ రుణ గ్రహీతలు ఏం చేయాలి?

గృహ రుణాలు సాధారణంగానే దీర్ఘకాలం పాటు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు రేట్లు పెరిగినా..తగ్గినా మిగతా రుణం, వడ్డీపై ప్రభావం భారీగానే ఉంటుంది. 

అయితే, కొత్తగా గృహ రుణాలు తీసుకోవాలనుకుంటున్న వాళ్లకు ప్రస్తుతం సరైన సమయం. ఇంకొన్నాళ్ల పాటు గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లే ఉండే అవకాశం ఉంది. వాస్తవానికి చాలా బ్యాంకులు లేదా సంస్థలు ఫ్లోటింగ్ రేటు ఆధారంగానే గృహ రుణాలను ఇస్తున్నాయి. ఆర్బీఐ దాన్ని తప్పనిసరి చేసింది కూడా. ఆర్బీఐ రెపో రేటు ఆధారంగానే గృహ రుణాల వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రెపోలో ఎలాంటి మార్పులు లేనందున ఇంకొన్నాళ్లు తక్కువ వడ్డీనే ఉంటుంది. 

ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వాళ్లు ఒకసారి తమ తమ లోన్లను రివ్యూ చేసుకుంటే మంచిది. గృహ రుణం తీసుకుని ఐదేళ్లు దాటి ఉంటే బేస్ రేట్(బీపీఎల్ఆర్), ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ రేట్– ఈబీఆర్ (ఎంసీఎల్ఆర్)లను పరిశీలించుకోవాలి. ప్రస్తుతం లోన్ దేని పరిధిలో ఉందో చూసుకోవాలి. 

ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ కు అనుసంధానించిన లోన్ కు తీసుకున్న గృహ రుణం బదిలీ కాలేదంటే ఎక్కువ వడ్డీని కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ వడ్డీ కడుతున్నట్టు అనిపిస్తే వెంటనే గృహ రుణం తీసుకున్న సంస్థను సంప్రదించాలి. లోన్ ను ఈబీఆర్ కు మార్చుకునేందుకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. దానికి కొంత ఫీజును వసూలు చేస్తారు. 

ఒకవేళ మార్చుకునే అవకాశం ఇవ్వకపోయినా.. ఉన్న ఈబీఆర్ లింక్డ్ హోమ్ లోన్ పైనే ఎక్కువ వడ్డీని వసూలు చేసినా వెంటనే రుణాన్నిచ్చే సంస్థను మార్చడం మేలు. వేరే సంస్థకు లోన్ ను బదిలీ చేసుకుంటే మంచిది. వడ్డీ రేట్లలో తేడా 0.5 శాతం లేదా అంతకన్నా ఎక్కువుంటేనే మార్చుకోవాలన్నది నిపుణుల సూచన. 

కార్ లోన్

కార్ లేదా వాహన రుణాల కాల పరిమితి ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం కారు రుణాలను తీసుకునే వారికి మంచి తరుణం. సాధారణంగా వాహన రుణాలన్నింటినీ ఫిక్స్ డ్ రేట్లపైనే ఇస్తుంటారు. కాబట్టి రెపో రేట్లలో ఎలాంటి మార్పు లేనందున ఇప్పుడు వడ్డీ రేట్లు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లోన్ తీసుకుంటే అదే వడ్డీ రేటు మనం తీసుకునే కాలపరిమితి వరకు కొనసాగుతుంది. 

ఇప్పటికే రుణం తీసుకుని ఉంటే..

ఎక్కువ వడ్డీ రేట్లున్నప్పుడు... ఉదాహరణకు రెండేళ్ల క్రితం రుణం తీసుకున్నట్టయితే.. ఇప్పుడు వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి వేరే సంస్థకు రుణాన్ని బదిలీ చేసుకోవడం మేలు. బదిలీ చేసుకోవడానికి ముందు రుణ నిబంధనలను ఒకసారి తెలుసుకోవాలి. రుణాన్ని ముందే క్లోజ్ చేసేదుంటే.. దానికి కొన్ని సంస్థలు చార్జీని వసూలు చేస్తాయి. కాబట్టి.. కొత్త లెండర్ కు మారేముందు అన్ని లెక్కలను వేసుకుని రుణాన్ని బదిలీ చేసుకోవాలి. 

వ్యక్తిగత రుణాలు

కొత్తగా వ్యక్తిగత రుణాలు తీసుకోవాలనుకునేవారికి ఇప్పుడు సరైన సమయమే. మరికొన్నాళ్లపాటు తక్కువ వడ్డీ రేట్లే కొనసాగే అవకాశం ఉంటుంది. క్రెడిట్ స్కోరు మంచిగా ఉంటే తక్కువ వడ్డీకే రుణాలు వచ్చే వీలుంటుంది. 

ఒకవేళ ఇప్పటికే వ్యక్తిగత రుణాలను తీసుకుని ఉండి ఉంటే.. వడ్డీ రేటు 16 శాతం కన్నా ఎక్కువుంటే వెంటనే లోన్ ను తక్కువ వడ్డీకిచ్చే సంస్థకు మార్చుకుంటే మేలు. పర్సనల్ లోన్ కాలపరిమితి మామూలుగా 3 నుంచి ఐదేళ్ల మధ్యే ఉంటుంది కాబట్టి.. వడ్డీ రేటు తగ్గితే చాలా వరకు లాభం ఉంటుంది.

More Telugu News