Pushpa: 'పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే' అని ప‌రీక్ష‌లో రాసిన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి.. ఫొటో వైర‌ల్

  • ప‌శ్చిమ బెంగాల్‌లో ఘ‌ట‌న‌
  • పుష్ప డైలాగు త‌ప్ప ఏమీ రాయ‌ని విద్యార్థి
  • చ‌దువుపై ఆసక్తి లేని విద్యార్థుల ధోర‌ణి చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌ వైనం
10th student writes pushpa dialogue

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాలోని 'పుష్ప.. పుష్పరాజ్.. త‌గ్గేదే లే' డైలాగు ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా మారుమోగిపోతూనే ఉంది. స‌ర‌దాగా చాలా మంది ఈ డైలాగును వాడుతున్నారు. అయితే, ఓ విద్యార్థి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో జ‌వాబు ప‌త్రంలో 'పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే' అని రాశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. 

ప‌శ్చిమ‌ బెంగాల్ లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఇటీవ‌ల ముగిశాయి. ప్ర‌స్తుతం పేపర్లు దిద్దే ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఓ విద్యార్థికి సంబంధించిన‌ పేప‌ర్ దిద్దుతుండ‌గా ఓ ఉపాధ్యాయుడు అందులో 'పుష్ప' డైలాగ్ ఉండ‌డాన్ని చూసి షాక్ అయ్యారు. ఆ ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ విద్యార్థి జ‌వాబు ప‌త్రాల్లో 'పుష్ప' డైలాగు త‌ప్ప‌ ఇంకేమీ రాయలేదని తెలుస్తోంది. 

ప‌శ్చిమ బెంగాల్‌లోనే పదో తరగతి పరీక్షల్లో చాలా మంది విద్యార్థులు ఇటువంటి ధోర‌ణినే క‌న‌బ‌ర్చుతున్నారు. చ‌దువుపై ఆస‌క్తిలేని వారు ఇటువంటి డైలాగులు రాస్తూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప‌శ్చిమ బెంగాల్‌ రాష్ట్ర అధికార పార్టీ టీఎంసీ నినాదమైన ‘ఖేలా హోబే’ (ఆట ముందుంది) అనే నినాదాన్ని కూడా కొంద‌రు విద్యార్థులు జ‌వాబు ప‌త్రాల్లో రాసిన విష‌యం తెలిసిందే. 

దీంతో ఇటువంటివి రాస్తే ఆ విద్యార్థుల జ‌వాబు ప‌త్రాలు దిద్ద‌కూడ‌ద‌ని అధికారులు భావిస్తున్నారు. త్వ‌ర‌లో 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఈ నిబంధ‌న‌ను అమ‌లు చేయాల‌ని యోచిస్తున్నారు. లేదంటే విద్యార్థుల్లో ఈ ధోర‌ణి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. 
 
        

More Telugu News