Ukraine: ఉక్రెయిన్ కు సరైన ఆయుధాలు అందిస్తే రష్యా సేనల అంతుచూస్తుంది: బ్రిటన్

  • రష్యా దళాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్
  • ఆయుధాల కోసం అర్థిస్తున్న ఉక్రెయిన్
  • భారీ లిస్టు చదివి వినిపించిన ఉక్రెయిన్ రక్షణమంత్రి
  • యుద్ధ ట్యాంకులు పంపించిన చెక్ రిపబ్లిక్
Britain says if provide right weapons to Ukraine it will push Russian troops back

ప్రపంచంలోనే అగ్రశ్రేణి సైనికశక్తిగా పేరుగాంచిన రష్యా... పొరుగుదేశం ఉక్రెయిన్ పై దాడి ప్రారంభించగానే, ఈ యుద్ధం మూడ్నాలుగు రోజుల్లోనే ముగుస్తుందని చాలామంది భావించారు. కానీ ఉక్రెయిన్ సైనికులు, ప్రజలు నరనరానా దేశభక్తిని నింపుకుని రష్యా సేనలను తీవ్రంగా ప్రతిఘటించారు. అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్ఫూర్తిదాయక నాయకత్వం ఉక్రెయిన్ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. 

ఈ నేపథ్యంలో, బ్రిటన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ కు సరైన ఆయుధాలు అందిస్తే రష్యా సేనల అంతుచూస్తుందని పేర్కొంది. ఈ క్రమంలో బ్రిటన్ ఇప్పటికే ఉక్రెయిన్ కు అనేక సాయుధ వాహనాలు పంపించింది. అయినప్పటికీ తమకు ఆయుధాల కొరత ఉందని, తగినన్ని ఆయుధ వ్యవస్థలు అందకపోతే డాన్ బాస్ ను రష్యా ఆక్రమించడం ఖాయమని జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిన్న చెక్ రిపబ్లిక్ దేశం ఉక్రెయిన్ కు యుద్ధ ట్యాంకులు పంపిన తొలిదేశంగా నిలిచింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉక్రెయిన్ సైన్యంలో సానుకూల దృక్పథం కనిపిస్తోందని వెల్లడించాయి. సరైన ఆయుధ వ్యవస్థలు అందుబాటులో ఉంటే, ఇప్పటికే అలసిపోయిన రష్యా సేనలను తరిమికొట్టవచ్చని ఉక్రెయిన్ సైన్యం బలంగా నమ్ముతోందని పేర్కొన్నాయి. 

కాగా, ఉక్రెయిన్ కోరుతున్న ఆయుధాల జాబితా చిన్నదేమీ కాదు. యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, లాంగ్ రేంజి శతఘ్నులు, యాంటీ షిప్ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థలు కోరుతోంది. ఉక్రెయిన్ రక్షణ మంత్రి డిమిత్రో కులేబా ఇవాళ నాటో దేశాలను ఆయుధాల కోసం అర్థించారు. అన్ని రకాల సైనిక అస్త్రాలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. 

కాగా, రానున్న మూడు వారాలు ఎంతో కీలకమని, ఈ యుద్ధంలో విజేత ఎవరో తేలిపోతుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News