Tamilisai Soundararajan: అమిత్ షాతో త‌మిళిసై భేటీ.. తెలంగాణ స‌ర్కారుపై కీల‌క వ్యాఖ్య‌లు

  • రెండు రోజులుగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో త‌మిళిసై
  • అమిత్ షాతో భేటీ వివ‌రాలు వెల్ల‌డించ‌లేన‌ని ప్ర‌క‌ట‌న‌
  • రాజ్ భ‌వ‌న్ ప‌ట్ల తెలంగాణ స‌ర్కారు నిర్లక్ష్యంగా ఉంద‌ని ఆవేద‌న‌
  • త‌న‌కు ప్రొటోకాల్ మ‌ర్యాద ద‌క్క‌లేద‌ని అన‌లేద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • త‌న ప‌ర్య‌ట‌న‌ల‌ను ఎవ‌రూ అడ్డుకోలేరన్న త‌మిళిసై
governor tamilisai harsh comments on telangana government

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ గురువారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ స‌ర్కారుపై ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం తాను తెలంగాణ‌ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేస్తున్నాన‌ని, ఈ ప‌ద‌విలో ఉండ‌గా తానెప్పుడూ బీజేపీ నేత‌గా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ హోదాలో ఉన్న త‌న‌ను బీజేపీ నేత‌లు కూడా ఒక‌టి, రెండు సార్లు మాత్ర‌మే క‌లిశార‌ని, అది కూడా త‌న‌ను గ‌వ‌ర్న‌ర్‌గా ప‌రిగ‌ణించి మాత్ర‌మే క‌లిశార‌ని ఆమె చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప‌రిస్థితుల‌ను కేంద్ర హోం శాఖ మంత్రికి వివ‌రించాన‌ని చెప్పిన త‌మిళిసై.. భేటీలో చ‌ర్చించిన అన్ని విష‌యాల‌ను బ‌య‌ట‌కు చెప్ప‌లేన‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోస‌మే ఎప్పుడూ తాను ఆలోచిస్తాన‌ని చెప్పిన గ‌వ‌ర్న‌ర్‌.. తెలంగాణ‌లో రైలు, రోడ్డు మార్గం ద్వారా మాత్ర‌మే తాను ప్ర‌యాణించ‌గ‌ల‌న‌ని వ్యాఖ్యానించారు. అలాంటి ప‌రిస్థితి త‌న‌కెందుకు వ‌చ్చిందో మీరే అర్థం చేసుకోవాలంటూ ఆమె మీడియా ప్ర‌తినిధుల‌తో అన్నారు. తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌యాణించ‌గ‌లిగే ప‌రిస్థితి ఇదేనని కూడా ఆమె వ్యాఖ్యానించారు. 

అయిన‌ప్ప‌టికీ త‌న ప్ర‌యాణాల‌ను తెలంగాణ‌లో ఎవ‌రూ ఆప‌లేర‌ని ఆమె మ‌రో కీల‌క వ్యాఖ్య చేశారు. మేడారం జాత‌ర‌కు తాను వెళ్లినప్పుడు ప్ర‌భుత్వం ప్రొటోకాల్ పాటించ‌లేద‌ని తాను అన‌లేద‌న్న త‌మిళిసై.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క ఆ విష‌యాన్ని చెప్పార‌న్నారు. యాదాద్రికి వెళ్లిన‌ప్పుడు తాను బీజేపీ నేత‌గా వెళ్లాన‌ని ప్ర‌భుత్వం ఎలా చెబుతుంద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రెండేళ్ల‌లో తాను బీజేపీ నేత‌ల‌ను ఒక‌టి, రెండు సార్లు మాత్ర‌మే క‌లిశాన‌న్న త‌మిళిసై.. తాను బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్నాన‌ని గుర్తు చేశారు. ప్ర‌భుత్వం అభ్యంత‌రాలు త‌న‌కు చెబితే తాను వాటికి స‌మాధానం చెబుతాన‌ని త‌మిళిసై అన్నారు. 

ఉగాది వేడుక‌ల‌కు తాను ఆహ్వానిస్తే ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎవ‌రూ ఎందుకు రాలేద‌ని త‌మిళిసై ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించే తీరు ఇదేనా? అని కూడా ఆమె నిల‌దీశారు. గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యాన్ని ఎందుకు అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ప్ర‌శ్నించిన త‌మిళిసై.. రాజ్ భ‌వ‌న్ ప‌ట్ల అంత నిర్ల‌క్ష్యం ఎందుక‌ని ప్ర‌శ్నించారు.

More Telugu News