summer: వేసవిలో ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే.. ఎండ ఏమీ చేయలేదు

  • ఎండలో ఎక్కువ సమయం ఉండొద్దు
  • తగినంత నీరు తీసుకోవాలి
  • లవణాల సమతుల్యత దెబ్బతినకూడదు
  • పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి
  • తేలికపాటి ఆహారం తీసుకోవాలి
Simple ways to beat the summer heat and its ill effects

ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉంటాయని పరిస్థితులను గమనిస్తే తెలుస్తోంది. ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల చెమటలు అధికంగా పడతాయి. దీంతో శరీరం ముఖ్యమైన లవణాలను కోల్పోతుంది. ఫలితంగా అలసటకు లోనవుతారు. తలనొప్పికి దారితీస్తుంది. తల తిరడం, గొంతు తడారిపోవడాన్ని గుర్తించొచ్చు. ఇవన్నీ కూడా ఎండ ప్రభావం సంకేతాలే. 

శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోకుండా చూసుకోవాలని వైద్య నిపుణుల సూచన. మెదడు, నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు సోడియం, పొటాషియం కీలకం. వీటినే ఎలక్ట్రోలైట్స్ గా చెబుతారు. ఇవి తగ్గితే సమస్యలు ఎదురవుతాయి. తగినంత నీరు తీసుకోవడం ఇందుకు ఒక పరిష్కారం. బయటకు వెళ్లే సమయంలో సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.

ఎక్కువ సమయం పాటు ఎండలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. బిగుతైన వస్త్రధారణకు దూరంగా ఉండాలి. తక్కువ బరువు, వదులుగా ఉండే వస్త్రాలు వేసుకోవాలి. అలసటగా, నీరసంగా అనిపిస్తే ఎండలోకి వెళ్లకుండా నీడనే విశ్రాంతి తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఎక్కువ పరిమాణంలో ఆహారాన్ని, అందులోనూ కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. రుతువుల వారీగా వచ్చే పండ్లను తీసుకోవాలి. ఆహారం కొంత, పండ్లు, కూరగాయలు కొంత చొప్పున రోజులో ఎక్కువ పర్యాయాలు తీసుకోవడం మంచిది. దీనివల్ల శరీరంలో నీటి పరిమాణం తగినంత నిలుస్తుంది. ఈ కాలంలో పుచ్చకాయ, కొబ్బరి బోండం, మజ్జిగ మేలు చేస్తాయి. కాఫీ, టీలకు దూరంగా ఉండాలి.

More Telugu News