TRS: టీఆర్ఎస్ ఆందోళ‌న‌ల‌పై తెలంగాణ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

  • టీఆర్ఎస్ రాస్తారోకోల‌పై హైకోర్టులో పిటిష‌న్‌
  • ఆందోళ‌న‌ల‌కు అనుమ‌తి లేద‌న్న తెలంగాణ హోం శాఖ‌
  • బ‌హిరంగ ప్ర‌దేశాల్లో కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అన్న కోర్టు
  • ఏం చ‌ర్య‌లు తీసుకున్నారో చెప్పాలంటూ ఆదేశాలు
telangana high court comments trs agitations

తెలంగాణ‌లో ఈ యాసంగిలో పండే ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌న్న డిమాండ్‌తో అధికార పార్టీ టీఆర్ఎస్ వ‌రుస‌బెట్టి ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఆందోళ‌న‌ల‌పై దాఖ‌లైన ఓ పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా తెలంగాణ హైకోర్టు బుధ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. 

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఆందోళ‌న‌ల‌కు త‌ప్ప‌నిస‌రిగా అనుమ‌తి తీసుకోవాల‌ని హైకోర్టు పేర్కొంది. అనుమ‌తులు తీసుకోకుండా జ‌రిగిన ఆందోళ‌న‌ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో చెప్పాల‌ని తెలంగాణ హోం శాఖ‌కు ఆదేశాలు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను రెండు వారాల‌కు వాయిదా వేసింది.

టీఆర్ఎస్ ధ‌ర్నాలు, రాస్తారోకోల‌తో ప్ర‌జా ర‌వాణాకు ఆటంకం క‌లుగుతోంద‌ని హైకోర్టులో ఓ పిటిష‌న్ దాఖలైంది. ఎలాంటి ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండానే ఆందోళ‌న‌లు చేస్తున్నారంటూ పిటిష‌న‌ర్ కోర్టుకు తెలిపారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో రాస్తారోకోకు అనుమ‌తి ఇవ్వ‌లేదంటూ ప్ర‌భుత్వం కోర్టుకు స‌మాధానం ఇచ్చింది. 

ఆ వెంట‌నే స్పందించిన హైకోర్టు అనుమ‌తి లేని ఆందోళ‌న‌ల‌ను అడ్డుకోవాల‌ని తేల్చి చెప్పింది. దీంతో త‌మ దృష్టికి వ‌చ్చిన ఆందోళ‌న‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హోం శాఖ చెప్ప‌గా... ఇప్ప‌టిదాకా ఏం చ‌ర్య‌లు తీసుకున్నారో చెప్పాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ, విచార‌ణ‌ను వాయిదా వేసింది.

More Telugu News