Twitter: మస్క్ మార్క్ అంటే అది.. ట్విట్టర్ పై ఎడిట్ బటన్!

  • ట్విట్టర్ లో ఎడిట్ బటన్ పై పోల్ నిర్వహించిన మస్క్
  • ఎక్కువ మంది నుంచి సానుకూల స్పందన
  • దీన్ని తీసుకొచ్చేందుకు పని చేస్తున్నామన్న ట్విట్టర్
Twitter edit button is finally coming

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో 9.2 శాతం వాటాను తీసుకున్న వెంటనే.. తనదైన మార్క్ చూపించారు. ఆధునికంగా ఆలోచించడంలో, వేగంగా నిర్ణయాలు అమలు చేయడంలో మస్క్ సిద్ధహస్తులు. ట్విట్టర్ పై ఎడిట్ బటన్ కావాలంటూ లక్షలాది మంది యూజర్లు ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ, ఇందులో ఉండే సాధక బాధకాల వల్ల సంస్థ దీన్ని అందుబాటులోకి తేవడం లేదు. కానీ, ఎలాన్ మస్క్ దీనిపై ఓటింగ్ పెట్టాడు. ‘ఎడిట్ బటన్ కావాలా? యస్ ఆర్ నో‘ చెప్పండంటూ పోలింగ్ నిర్వహించాడు. దీనికి ఎక్కువ మంది యస్ అంటూ ఓటు వేశారు. 

మస్క్ పోలింగ్ పెట్టడాన్ని చూసి ట్విట్టర్ సీఈవో, భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ కూడా లైన్లోకి వచ్చారు. ‘‘ఈ పోల్ పరిణామాలు చాలా కీలకం అవుతాయి. కనుక జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి’’ అని యూజర్లను కోరారు. ట్వీట్లలోని కంటెంట్ ను ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చేందుకు ట్విట్టర్ సుముఖంగానే ఉందంటూ, అదే సమయంలో లాభ, నష్టాల గురించి ఆలోచించాలని సూచించారు. 

ఎడిట్ బటన్ తో ఉండే నష్టాలను కొందరు ప్రస్తావించారు. ట్వీట్లు వివాదాస్పదం అయితే యూజర్లు తమ విధానాన్ని మార్చుకునేందుకు ఎడిట్ బటన్ అవకాశం కల్పిస్తుందన్నారు. అయితే చివరికి మస్క్ పోలింగ్ పుణ్యమా అని ఎడిట్ బటన్ తీసుకురావడంపై పనిచేస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. 

More Telugu News