Rajasthan Royals: బెంగళూరును గెలిపించిన అహ్మద్, దినేశ్ కార్తీక్.. రాజస్థాన్‌కు తొలి ఓటమి

  • జోరుమీదున్న రాజస్థాన్‌కు ఎదురుదెబ్బ
  • చేతిలో కావాల్సినన్ని వికెట్లున్నా జోరుగా ఆడలేకపోయిన రాజస్థాన్
  • తడబడి నిలబడిన బెంగళూరు
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా దినేశ్ కార్తీక్
Karthik and Shahbaz power RCB to hard fought win

వరుస విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. 170 పరుగుల ఓ మాదిరి లక్ష్య ఛేదనలో బరిలోకి దిగి 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆ తర్వాత భలేగా పుంజుకుంది. షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్ బ్యాట్‌తో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఫలితంగా బెంగళూరు ఖాతాలో మరో విజయం చేరింది.

లక్ష్య ఛేదనలో బెంగళూరు తొలుత తడబడింది. తొలి వికెట్‌కు కెప్టెన్ డుప్లెసిస్ (29), అనూజ్ రావత్ (26) కలిసి 55 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి పునాది వేశారు. అయితే, ఆ తర్వాత జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. 55 పరుగుల వద్ద డుప్లెసిస్ వెనుదిరగ్గా 61 పరుగుల వద్ద మరో ఓపెనర్ రావత్ అవుటయ్యాడు. దానికి మరో పరుగు జోడించాక  విరాట్ కోహ్లీ (5), డేవిడ్ విల్లీ (0) పెవిలియన్ బాటపట్టారు. ఆ తర్వాత కాసేపటికే షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (5) అవుటడయ్యాడు.

దీంతో అప్పటి వరకు బలంగా కనిపించిన జట్టు ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయింది. జట్టు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్న షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్‌ బ్యాట్ ఝళిపించారు. దీంతో మళ్లీ పరుగుల ప్రవాహం మొదలైంది. బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ బౌండరీల మోత మోగించారు. షాబాజ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు, దినేశ్ కార్తీక్ 23 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 44 పరుగులు చేసి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. హర్షల్ పటేల్ 4 బంతుల్లో సిక్సర్‌తో 9 పరుగులు చేయడంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే జట్టు విజయాన్ని అందుకుంది. దినేశ్ కార్తీక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో పరుగులు రావడం కష్టమైంది. చేతిలో కావాల్సినన్ని వికెట్లున్నా దూకుడుగా ఆడలేకపోయారు. వారి బ్యాటింగ్ తీరు చూసి 130 పరుగులైనా చేస్తుందా? అన్న అనుమానం వచ్చింది. 18వ ఓవర్ ముగిసే సరికి ఆ జట్టు చేసింది 127 పరుగులే. అయితే, ఆ తర్వాత ఆ స్వరూపం పూర్తిగా మారిపోయింది.

చివరి రెండు ఓవర్లలో బట్లర్, హెట్మెయిర్ చెలరేగిపోయారు. ఇద్దరూ కలిసి బంతులను ఎడాపెడా స్టాండ్స్‌కు తరలించారు. దీంతో ఆ రెండు ఓవర్లలో పరుగుల వాన కురిసింది. నాలుగో వికెట్‌కు ఇద్దరూ కలిసి అజేయంగా 83 పరుగులు జోడించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బట్లర్ 47 బంతుల్లో 6 సిక్సర్లతో 70, హెట్మెయిర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేశారు. పడిక్కల్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు.

More Telugu News